జబర్దస్త్‌లో ‘ఎమ్మెల్సీ’ నాగబాబు.. రీఎంట్రీనా.. స్పెషల్ ఎంట్రీనా?
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో రేపోమాపో మంత్రి పదవి అన్నంత హైప్ వచ్చిన కొణిదెల నాగబాబుకు ఆ యోగం ఇంకా దక్కలేదు.
By: Tupaki Desk | 10 July 2025 9:37 AM ISTఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో రేపోమాపో మంత్రి పదవి అన్నంత హైప్ వచ్చిన కొణిదెల నాగబాబుకు ఆ యోగం ఇంకా దక్కలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పినా.. నాగబాబుకు మంత్రి పదవి అసలు వస్తుందా? రాదా? అన్నదాని మీద కూడా స్పష్టత లేదు. దీనిపై అటు నాగబాబు నుంచి కానీ, ఇటు ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి కానీ సమాచారం లేదు. మరి నాగబాబు ఎమ్మెల్సీగానే ఉంటారా? లేక జనసేన పార్టీ వ్యవహారాలకు పరిమితం అవుతారా? లేక పిఠాపురం బాధ్యతల్లో తలమునకలు అవుతారా? అనే ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలుస్తున్నాయి.
ఈ క్రమంలో నాగబాబు భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? తనకు ఎంతో పేరు తెచ్చిన టీవీ కార్యక్రమం జబర్దస్త్‌కు తిరిగి జడ్జిగా వెళ్తారా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ, ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయినట‍్టుగానే కనిపించారు. మరోవైపు 12 ఏళ్ల కిందట మొదలైన జబర్దస్త్ ఓ దశలో అత్యంత ఆదరణ పొందింది. అయితే, రాన్రాను కొన్ని కారణాలతో వెనుకబడిపోయింది. మొదట్లో జడ్జిలుగా వచ్చిన నాగబాబు, రోజా ఈ ప్రోగ్రాం బాగా ఆకట్టుకుంది. అప్పట్లో టీమ్‌లు కూడా పకడ‍్బబందీగా ఉండడం సక్సెస్‌కు కారణమైంది. వేర్వేరు నేపథ్యాలతో చాలామంది దూరం కావడంతో జబర్దస్త్ సాధారణంగా మిగిలిపోయింది.
అయితే, ఇప్పుడు ఆ ఖతర్నాక్ కామెడీ షోలో అదిరిపోయే న్యూస్. ప్రేక్షకులు ఆ మేరకు ఫీల్ అయ్యే మ్యాటర్ బయటకు వచ్చింది జబర్దస్ నిర్మాణ సంస్థ మల్లెమాల నుంచి.
నాగబాబు క్రియాశీల రాజకీయాలకు వెళ్లక ముందే జబర్దస్త్‌ను వీడారు. వేరే టీవీలలో మరో కామెడీ షోలు చేశారు. కానీ, అవి కొనసాగలేదు. ఆపై రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఆరు నెలల కిందట ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఇక జబర్దస్త్‌కు 12 ఏళ్లయిన సందర్భంగా మల్లెమాల సంస్థ పెద్దెత్తున వేడుకలు ప్లాన్ చేసింది. వాటిలోనే నాగబాబు తళుక్కుమన్నారు. ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చాలా ఏళ్ల అనంతరం నాగబాబు జడ్జీ స్థానంలో కూర్చోవడంతో పాటు షోలో ఒకప్పుడు వెలుగు వెలిగిన కమెడియన్లు అందరూ కనిపించారు. చమ్మక్ చంద్ర, అదిరే అభి, రైజింగ్ రాజు, బలగం వేణు, హైపర్ ఆది, ధనాధన్ ధనరాజ్, గెటప్ శ్రీను, షకలక శంకర్.. పాల్గొన్న వేడుక ప్రోమో చివరిలో ‘‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే’’
అనే ఓజీ వాయిస్ ఓవర్‌తో నాగబాబు రాయల్ రీఎంట్రీ ఇచ్చారు.
చివరాఖరులో.. "కావాల్సిన వాడు వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంట్రా కుయ్యా.. మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ డైలాగ్‌తో అదరగొట్టారు నాగబాబు. ప్రోమోలో నాగబాబుతో పాటు షో ప్రారంభ రోజుల టీమ్ లీడర్లని సత్కరించారు. అనసూయ, రష్మీతో పాటు యాంకరింగ్ చేసిన సౌమ్య రావ్ కూడా హాజరయ్యారు. హీరోయిన్ ఇంద్రజ కూడా రీఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రోమో చూసినవారు ఈ ప్రోమోనే అసలైన న్యూ ఛాప్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
కాగా, నాగబాబు జబర్దస్త్‌తో ఉన్న అనుంబంధం రీత్యా కేవలం గెస్ట్‌గానే హాజరైనట్లు భావించాలి. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పైగా మంత్రి అయ్యే చాన్స్ కూడా ఉంది. ఇప్పటికే జడ్జిలుగా వేరే వారు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు.
