Begin typing your search above and press return to search.

మాటలు అనుకున్నారు.. ఫంక్షన్లో కలిసిపోయారు

ఈ వాదోపవాదాలు, కామెంట్లు చూస్తే ఇద్దరి మధ్య గొడవ పెద్ద స్థాయికి వెళ్లిపోయినట్లు కనిపించింది. కానీ ఈ ఇద్దరూ తాజాగా ఒక ఫంక్షన్లో కలిసిపోయి కనిపించారు.

By:  Garuda Media   |   9 July 2026 8:58 PM IST
మాటలు అనుకున్నారు.. ఫంక్షన్లో కలిసిపోయారు
X

ఇటీవల టాలీవుడ్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య గొడవ ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. కొన్నేళ్ల ముందు నుంచే సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ కోసం ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా.. అందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నిరాకరిస్తున్నారు. ఈ విషయమై కొన్ని నెలల ముందు ఇరు వర్గాల మధ్య మాటల దాడి తీవ్రమైంది. పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల ప్రతినిధిగా ఉన్న సునీల్ నారంగ్‌కు, నిర్మాతల రెప్రజెంటేటివ్ నాగవంశీకి మధ్య మాటల దాడి తీవ్ర స్థాయిలో జరిగింది. అది కాస్తా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకునే వరకు వెళ్లింది.

ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మల్టీప్లెక్సులు కట్టేస్తున్న వ్యక్తి సింగిల్ స్క్రీన్ల కష్టాల గురించి మాట్లాడుతున్నాడంటూ నారంగ్ మీద నాగవంశీ కౌంటర్ వేస్తే.. ప్రతిగా నాగవంశీ మీద బాడీషేమింగ్ కామెంట్స్ చేశాడు నారంగ్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీని గురించి స్పందిస్తూ.. నారంగ్ పేరెత్తకుండా ఆయన డబ్బున్న వ్యక్తి అని.. ఆయన వార్ మొదలుపెట్టాడని, తాను కంటెంట్‌తో సమాదానం చెబుతానని ఛాలెంజ్ లాంటిది విసిరాడు నాగవంశీ.

ఈ వాదోపవాదాలు, కామెంట్లు చూస్తే ఇద్దరి మధ్య గొడవ పెద్ద స్థాయికి వెళ్లిపోయినట్లు కనిపించింది. కానీ ఈ ఇద్దరూ తాజాగా ఒక ఫంక్షన్లో కలిసిపోయి కనిపించారు. అది నారంగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరి పెళ్లి వేడుక కావడం విశేషం. ఆ వేడుకకు నాగవంశీ హాజరవడం, ఆయన్ని సునీల్ నారంగ్ సాదరంగా ఆహ్వానించడం, కలిసి ఫొటో దిగడం వీడియోలకు చిక్కింది. ఇటీవల జరిగిన పరిణామాలు పట్టించుకోకుండా నాగవంశీని నారంగ్ పెళ్లికి పిలిచారంటే విశేషమే. కాబట్టి ప్రొఫెషనల్‌గా తలెత్తిన గొడవ పర్సనల్ స్థాయికి వెళ్లలేదని భావించవచ్చు. దీని మీద నెటిజన్లు సరదాగా పంచులు వేస్తున్నారు. అంత గొడవ పడి.. ఇప్పుడు ‘మీరు మీరు కలిసిపోయారా’ అంటూ మీమ్స్ వేస్తున్నారు.