హిందీని మించి వసూలు చేయాలి: నాగవంశీ
'వార్ 2' తెలుగు వెర్షన్ సమర్పకుడు నాగవంశీ మాట్లాడుతూ- వార్ 2 నచ్చకపోతే తనను అభిమానులు తిట్టొచ్చని అన్నారు.
By: Sivaji Kontham | 11 Aug 2025 10:06 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఈ చిత్రం అత్యంత భారీగా విడుదల కానుండగా, హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో తారక్, హృతిక్ సోదరభావం అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనకు తమ్ముడు అంటూ తెలుగులో మాట్లాడిన హృతిక్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరిచారు.
'వార్ 2' తెలుగు వెర్షన్ సమర్పకుడు నాగవంశీ మాట్లాడుతూ- వార్ 2 నచ్చకపోతే తనను అభిమానులు తిట్టొచ్చని అన్నారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక తెలుగు సినిమా చూసినట్టుగా ఉంటుందని కూడా అన్నారు. ఎన్టీఆర్ అన్నను బాలీవుడ్ కి పంపుతున్నామని అనుకునే కంటే హృతిక్ రోషన్ ని తెలుగు సినిమాకు స్వాగతిస్తున్నట్టు అనిపిస్తోందని కూడా నాగవంశీ వ్యాఖ్యానించారు. ''దేవర కంటే ఈ సినిమా పదిరెట్లు అధికంగా వసూలు చేయాలి. హిందీ వెర్షన్ ని మించి తెలుగులో వసూళ్లు సాధించేందుకు అభిమానులు సహకరించాలని'' కూడా నాగవంశీ అభ్యర్థించారు. ఫ్యాన్స్ కచ్ఛితంగా ఈ యాక్షన్ సినిమాను ఇష్టపడతారని అన్నారు. ఎన్టీఆర్ అన్న మనకోసం చాలాసార్లు తన కాలర్ ఎత్తాడు. `వార్ 2`ని పెద్ద హిట్ అయ్యేలా చేయడం, ఆయన కోసం మన కాలర్ ఎత్తడం మన బాధ్యత అని నాగ వంశీ వేదికపై వ్యాఖ్యానించారు.
ఈ వేదికపై ఎన్టీఆర్ తన ప్రసంగం అనంతరం చొక్కా కాలర్ ఎత్తి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు. ప్రతిసారీ ఒక వైపు కాలర్ ఎత్తేవాడిని.. ఈసారి రెండు కాలర్లు ఎత్తాను... ఎవరేమనుకున్నా ఈసారి అదిరిపోయే విజయం సాధిస్తున్నాను అని ఎన్టీఆర్ నమ్మకంగా చెప్పారు. ఎన్టీఆర్ తన అభిమానులను ఎగ్జయిట్ చేస్తున్న సమయంలో హృతిక్ రోషన్ కూడా అతడి వద్దకు వచ్చి తన చొక్కా రెండు వైపులా కాలర్లు ఎత్తి చూపిస్తూ తారక్ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు. తెలుగు సినిమా ఈవెంట్ లో అభిమానుల జోష్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా వీక్షిస్తూ హృతిక్ స్టన్ అయ్యారు. ఎన్టీఆర్ ఇంతటి అభిమానాన్ని సాధించారు. అతడు రియల్ టైగర్ అంటూ పొగిడేశారు హృతిక్.
