Begin typing your search above and press return to search.

ఎగ్జిబిట‌ర్స్ (X) నిర్మాత‌లు: సింగిల్ స్క్రీన్ల దుస్థితిపై నిర్మాత నాగవంశీ నిలదీత

టాలీవుడ్ లో ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్సెస్ నిర్మాత‌ల వార్ పీక్స్ కి చేరుకుంటోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిష‌న్ లో ఉన్న చాలా స‌మ‌స్య‌ల గురించి సింగిల్ స్క్రీన్ల గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

By:  Sivaji Kontham   |   14 May 2026 9:26 AM IST
ఎగ్జిబిట‌ర్స్ (X) నిర్మాత‌లు: సింగిల్ స్క్రీన్ల దుస్థితిపై నిర్మాత నాగవంశీ నిలదీత
X

టాలీవుడ్ లో ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్సెస్ నిర్మాత‌ల వార్ పీక్స్ కి చేరుకుంటోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిష‌న్ లో ఉన్న చాలా స‌మ‌స్య‌ల గురించి సింగిల్ స్క్రీన్ల గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కుముందు సునీల్ నారంగ్, చ‌ద‌ల‌వాడ‌, శిరీష్ రెడ్డి వంటి ప్ర‌ముఖ పంపిణీ దారుల స‌మ‌క్షంలో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో పంపిణీ దారులంతా త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించిన సంగ‌తి తెలిసిందే. ఎగ్జిబిట‌ర్ నిల‌బ‌డాలంటే అద్దె విధానం కాకుండా ప‌ర్సంటేజ్ షేరింగ్ విధానం అనుకూల‌మ‌ని, దీని వ‌ల్ల ఎగ్జిబిష‌న్ రంగం నిల‌బ‌డుతుందని విశ్లేషించారు. తాము ప‌ర్సంటేజ్ షేరింగ్ విధానాన్ని ఇప్ప‌టికే అమ‌ల్లో ఉంచామ‌ని, దీనిని ఇక‌పై ఎవ‌రూ మార్చ‌లేర‌ని కూడా అన్నారు. అలాగే సినిమా టికెట్ ధ‌ర‌లు అన‌వ‌స‌రంగా పెంచేదే లేద‌ని, త‌ద్వారా థియేట‌ర్ల‌కు ఆడియెన్ ని ర‌ప్పిస్తామ‌ని కూడా ఎగ్జిబిట‌ర్స్ అంతా చెబుతున్నారు. ప‌ర్సంటేజ్ షేరింగ్ విధానం రాక‌పోతే అద్దె విధానంతో థియేట‌ర్లు అన్నీ మూత ప‌డ‌తాయ‌ని శిరీష్ ఆందోళ‌న చెందారు.

అయితే సింగిల్ స్క్రీన్ల వ్య‌వ‌స్థ స‌మూల నాశ‌నానికి కార‌ణమని మ‌ల్టీప్లెక్సులేన‌ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాత‌ల స‌మీక్షా స‌మావేశంలో కౌంట‌ర్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యువ‌నిర్మాత నాగ‌వంశీ థియేటర్ల యాజమాన్యాల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల మీద ఉన్న శ్రద్ధ, సింగిల్ స్క్రీన్ల నిర్వహణపై ఎందుకు లేదని ఆయన ఎగ్జిబిటర్లను నేరుగా ప్రశ్నించారు. ప్రేక్షకులు ఇచ్చే టికెట్ రేట్ల విషయంలో రాజీ పడని యాజమాన్యాలు, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని నాగవంశీ పేర్కొన్నారు. సినిమా విడుదల సమయంలో మాత్రమే ఎగ్జిబిటర్లకు సింగిల్ స్క్రీన్లు గుర్తుకొస్తాయని, కానీ వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. మల్టీప్లెక్సులకు వెళ్లే ప్రేక్షకులకు లభించే అనుభూతికి, సింగిల్ స్క్రీన్లలో ఉండే వాతావరణానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మూసాపేటలోని ఒక మల్టీప్లెక్స్ ఉదాహరణను ప్రస్తావించారు. అక్కడ ఒక ఎగ్జిబిటర్ మల్టీప్లెక్సును ఎంతో అద్భుతంగా, విలాసవంతంగా తీర్చిదిద్దారని, దాని ఎదుట ఉన్న సింగిల్ స్క్రీన్ ని బాగు చేస్తామ‌న్నా య‌జ‌మానికి అవ‌కాశం ఇవ్వ‌రని అన్నారు. మ‌ల్టీప్లెక్సుల‌ను డెవలప్ చేస్తున్న వారు.. మరోవైపు సింగిల్ స్క్రీన్ల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిల‌దీసారు.

సింగిల్ స్క్రీన్ల లోపలికి వెళ్తే కనీసం కూర్చోలేమని అవి `కుక్క తొట్టి` లాగా వాసన వస్తున్నాయని నాగవంశీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు డబ్బులు ఇచ్చి సినిమా చూడటానికి వస్తున్నప్పుడు వారికి శుభ్రమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. సింగిల్ స్క్రీన్లను కూడా మల్టీప్లెక్స్ తరహాలోనే ఆధునీకరించి, ప్రేక్షకులకు మంచి సినిమా అనుభూతిని ఎందుకు కలిగించలేరని ఆయన ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ మనుగడకు థియేటర్లే కీలకమని, అలాంటి చోట కనీస సౌకర్యాలు లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. కేవలం లాభాలనే కాకుండా, థియేటర్ల అభివృద్ధిని కూడా ఎగ్జిబిటర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని నాగవంశీ ఈ సందర్భంగా కోరారు.

విశాఖ‌లో సింగిల్ స్క్రీన్లకే రెవెన్యూ ఎక్కువ‌:

హైదరాబాద్‌లోని థియేటర్ల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరుపై ప్రముఖ నిర్మాత నాగవంశీ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. హైద‌రాబాద్ థియేట‌ర్ల‌తో పోలిస్తే.. విశాఖపట్నం వంటి నగరాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నాగవంశీ ఉదాహరణగా చూపారు. వైజాగ్‌లో మల్టీప్లెక్సుల కంటే సింగిల్ స్క్రీన్లకే ఎక్కువ రెవెన్యూ వస్తుందని, దానికి కారణం అక్కడి థియేటర్ల నిర్వహణేనని చెప్పారు. జగదాంబ, సంగం-శరత్ వంటి థియేటర్లు ఎంతో అందంగా, అద్భుతంగా అభివృద్ధి చెందాయని.. అలాంటి సంస్కృతి హైదరాబాద్‌లో ఎందుకు లేదని ఆయన నిల‌దీసారు. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్లను అభివృద్ధి చేస్తే ప్రేక్షకులకు మెరుగైన అనుభూతి దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

ఎగ్జిబిటర్ల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.. ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతున్నప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మీకు సింగిల్ స్క్రీన్లు, ఎగ్జిబిటర్లు గుర్తుకొస్తారా? అని నాగవంశీ ప్రశ్నించారు. కేవలం అవసరానికే కాకుండా, నిరంతరం సింగిల్ స్క్రీన్ల అభివృద్ధిని పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు

హైద‌రాబాద్ లో కూడా సింగిల్ స్క్రీన్ల‌ను అభివృద్ధి చేయాల‌ని నాగ‌వంశీ డిమాండ్ చేసారు. వాటిని ప‌ట్టంచుకోకుండా .. సిటీలోని మ‌ల్లీప్లెక్సుల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకుంటున్నార‌ని అన్నారు. ``మ‌ల్టీప్లెక్సుల‌కు రెవెన్యూ వెళుతోంది.. సినిమాల ఫీడింగ్ వెళుతోంది.. ముందు మీరు మ‌ల్టీప్లెక్సులు నింపుకోవ‌డానికి మీ క‌డుపు నింపుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.. సింగిల్ స్క్రీన్ల ఎదుగుద‌ల‌ను ఆపేస్తున్నార‌``ని కూడా నాగ‌వంశీ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.