Begin typing your search above and press return to search.

లెనిన్ నిర్మాత.. మళ్లీ తప్పులో కాలేశాడు

కొన్నిసార్లు సానుభూతి కూడా పని చేసి సినిమాలకు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి.

By:  Garuda Media   |   16 July 2026 2:54 PM IST
లెనిన్ నిర్మాత.. మళ్లీ తప్పులో కాలేశాడు
X

ఈ రోజుల్లో సినిమాల ఫలితాలు, వసూళ్లు కేవలం కంటెంట్ మీద మాత్రమే ఆధారపడిలేవు. ఇతర అంశాలు కూడా వాటిని ప్రభావితం చేస్తున్న పరిస్థితి. సినీ జనాల మాటలు, నడవడికను బట్టి కూడా జనం కొన్నిసార్లు వాటి ఫలితాలను నిర్దేశిస్తున్నారు. అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. కొన్నిసార్లు సానుభూతి కూడా పని చేసి సినిమాలకు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి.

అదే సమయంలో కొందరు అహంకారంతో మాట్లాడుతున్నట్లు అనిపించినా, తమ ఇగోను దెబ్బతీసిన ఫీలింగ్ కలిగినా.. జనం వారి చిత్రాల మీద నెగెటివ్ ఒపీనియన్ ఏర్పరుచుకుని సినిమాకు చేటు జరిగిన సందర్భాలూ ఉంటున్నాయి. గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘వార్-2’ విషయంలో నిర్మాత నాగవంశీ చేసిన అధిక ప్రసంగం జనాలకు నచ్చలేదు. ఈ చిత్రానికి హిందీలో కంటే తెలుగులో ఎక్కువ షేర్ ఇవ్వాలని, అది మన బాధ్యత అని నాగవంశీ అనడం చాలామందికి నచ్చలేదు. సినిమాలో కంటెంట్‌ను బట్టి చూస్తారు కానీ.. హిందీలో కంటే తెలుగులో ఎక్కువ షేర్ ఇవ్వాలి, అది మీ బాధ్యత అని అంటే ప్రేక్షకులకు ఎలా ఉంటుంది? దీని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.

అయినా సరే నాగవంశీ మారలేదు. తాజాగా అఖిల్ అక్కినేనితో ఆయన నిర్మించిన 'లెనిన్' సినిమా బాగా ఆడుతూ సూపర్ హిట్ దిశగా వెళ్తుండగా.. గుంటూరులో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో నాగవంశీ.. చిత్రమైన కామెంట్స్ చేశాడు. అఖిల్‌కు మనం వంద కోట్ల కలెక్షన్ల సినిమా ఇవ్వాలని.. అందుకు అందరూ కలిసి రావాలని.. తనకు సపోర్ట్ చేయాలని నాగవంశీ అన్నాడు.

నిజానికి యావరేజ్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న ‘లెనిన్’ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టిందంటే అఖిల్ పట్ల జనాల్లో కొంత సానుకూలత ఉండడం కారణం. దాన్ని పోగొట్టేలా వంద కోట్ల సినిమా ఇద్దాం, కలిసి రండి అంటూ.. అదేదో ప్రేక్షకుల బాధ్యత అన్నట్లు మాట్లాడ్డం వినడానికి అంత బాగా లేదు. ‘వార్-2’ అనుభవం తర్వాత కూడా నాగవంశీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యమే.