Begin typing your search above and press return to search.

ట్రోల‌ర్స్‌కి అవ‌కాశం ఇవ్వ‌ని చైతూ థ్రిల్ల‌ర్‌!

అయితే తాజాగా విడుద‌లైన నాగ‌చైత‌న్య `వృష‌క‌ర్మ‌` గ్లింప్స్ ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టింది.

By:  Ravindar Gorantla   |   6 March 2026 8:00 PM IST
ట్రోల‌ర్స్‌కి అవ‌కాశం ఇవ్వ‌ని చైతూ థ్రిల్ల‌ర్‌!
X

గ‌త కొంత కాలంగా పీరియాడిక్‌, మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో పాటు కామెడీ హీరర్ నేప‌థ్యంలో రూపొందే సినిమాలకు గ్రాఫిక్స్ వ‌ర్క్ అన్న‌ది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. చాలా వ‌ర‌కు సినిమాలు గ్రాఫిక్స్‌పై ఆధార‌ప‌డుతుండ‌టంతో ప్రేక్ష‌కులు కూడా ప్ర‌తి సీన్‌ని ప‌రీక్ష‌గా చూస్తున్నారు. క్వాలిటీ ఏ స్థాయిలో ఉంది? అని ఆరాతీస్తున్నారు. దీంతో ఇటీవ‌ల విడుద‌లైన సినిమాల్లోని గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్‌కు గురికావ‌డం తెలిసిందే. మైథాల‌జీ నేప‌థ్యంలో రూపొంతున్న ఓ ఫాంట‌సీ మూవీ టీజ‌ర్‌పై కొన్ని నెల‌ల క్రితం విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

స్టార్ హీరో సినిమాకు ఇలాంటి గ్రాఫిక్సా అంటూ అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ మేక‌ర్స్‌తో పాటు ద‌ర్శ‌కుడిని ట్రోల్ చేశారు. ఆ త‌రువాత హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో రూపొందిన సినిమాకు కూడా ఇదే త‌ర‌హా విమర్శ‌లు ఎదుర‌య్యాయి. ప్ర‌తి సీన్‌లోనూ గ్రాఫిక్స్ లోపాలు క‌నిపించ‌డం, ప‌తాక ఘ‌ట్టాల్లోనూ నాణ్యాతా ప్ర‌మాణాలు పాఠించ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు టీమ్‌పై విరుచుకున‌ప‌డ్డారు. నెట్టింట ట్రోల్ చేస్తూ కామెంట్‌లు చేశారు. దీంతో అంద‌రిలోనూ భ‌యం మొద‌లైంది. గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా సినిమాలు రూపొందిస్తున్న ప్ర‌తి మేక‌ర్ ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ట్రోల్స్ గురించి భ‌య‌ప‌డుతున్నారు.

తాజా ప‌రిణామాల నేఫ‌థ్యంలో ఇటీవ‌ల హీరో నిఖిల్ త‌ను న‌టించిన `స్వ‌యంభు` మూవీ వీఎఫ్ ఎక్స్ గురించి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. నిఖిల్ న‌టిస్తున్న `స్వ‌యంభు`ఓ పీరియాడిక్ మూవీ. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్‌ని రిలీజ్ చేసిన సంద‌ర్భంలో నిఖిల్ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారి కొంద‌రి అభిమానుల్ని ఆగ్ర‌హానికి గురి చేశాయి.

మా సినిమాలో ఎలాంటి AI ని ఉప‌యోగించ‌లేద‌న్నాడు. అంతే కాకుండా ఇటీవ‌ల విడుద‌లైన సినిమాల మాదిరిన AI ని వాడ‌లేద‌ని నెటిజ‌న్ చేసిన ట్వీట్‌ని లైక్ చేయ‌డంతో అస‌లు గొడ‌వ మొద‌లైంది. ఇటీవ‌ల విడుద‌లైన సినిమాపై కావాల‌నే నిఖిల్ ఈ వాఖ్య‌లు చేశాడ‌ని అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా ప్రొడ్యూస‌ర్ డైరెక్ట‌ర్‌గా మారి రూపొందించిన `నాగ‌బంధం` మూవీని ట్రోల్స్ చేశారు. దీంతో భారీ సినిమాల వీఎఫ్ ఎక్స్‌పై పెద్ద ర‌చ్చే జ‌రిగి చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే తాజాగా విడుద‌లైన నాగ‌చైత‌న్య `వృష‌క‌ర్మ‌` గ్లింప్స్ ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టింది. సినిమాలోని కంటెంట్‌, ఆస‌క్తిక‌ర‌మైన విజువ‌ల్స్ ప్ర‌తి ఒక్క‌రిని క‌ట్టిప‌డేశాయి. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉండ‌టం, అందుకు త‌గ్గ‌ట్టుగా ఆస‌క్తిని రేకెత్తించే సీన్‌లు, దాన్ని హైలైట్ చేస్తూ వీఎఫ్ ఎక్స్ ఉండ‌టంతో `వృష‌క‌ర్మ‌`పై నెట్టింట ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కంటెంట్ బలంగా ఉంటే ఆడియ‌న్స్ దృష్టి గ్రాఫిక్స్ వైపు వెళ్ల‌ద‌ని ఈ సినిమా నిరూపించింద‌ని కామెంట్‌లు చేస్తున్నారు. చైతూ క్యారెక్ట‌ర్‌ని మ‌లిచిన తీరు, క‌థ‌, క‌థ‌నాల‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తూ ఇంటెన్సిటీతో సాగే స‌న్నివేశాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయ‌ని, ఎన్నాళ్లుకు చైతూ త‌న స్థాయికి త‌గ్గ క‌థని ఎంచుకున్నాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజా ప్ర‌శంస‌ల నేప‌థ్యంలో `వృష‌క‌ర్మ‌` ట్రోల‌ర్స్‌కి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని, ప‌ర్‌ఫెక్ట్ విజువ‌ల్స్‌తో ఆక‌ట్టుకుని అంద‌రిని ఆక‌ట్టుకుంటోంద‌ని అక్కినేని అభిమానులు అంటున్నారు.