సామ్ పెళ్లి రోజే చైతూ పోస్ట్.. 'నిజాయితీ' అంటూ..
సోషల్ మీడియాలో కొన్ని సందర్భాల్లో సెలబ్రెటీలు పోస్ట్ చేసే విధానం ఊహించని విధంగా వైరల్ అవుతుంది.
By: Tupaki Desk | 2 Dec 2025 11:23 AM ISTసోషల్ మీడియాలో కొన్ని సందర్భాల్లో సెలబ్రెటీలు పోస్ట్ చేసే విధానం ఊహించని విధంగా వైరల్ అవుతుంది. ఒక్కోసారి అది యాదృచ్ఛికంగా జరిగినా, నెటిజన్లు మాత్రం దానికి రకరకాల అర్థాలు తీస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే హీరో నాగచైతన్యకు ఎదురైంది. ఒకవైపు మాజీ భార్య సమంత రెండో పెళ్లి వేడుకలు కోయంబత్తూరులో జరుగుతుంటే, అదే రోజు చైతన్య పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఆ రోజు అందరి దృష్టీ సమంత పెళ్లి మీదే ఉంది. ఆమె కొత్త జీవితం మొదలుపెడుతున్న సందర్భంలో, చైతన్య నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. సరిగ్గా అదే సమయానికి చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో "నిజాయితీ" (Honesty) అనే పదాన్ని వాడటంతో, ఇది కచ్చితంగా సమంతను ఉద్దేశించే పెట్టి ఉంటారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.
ఆ పోస్ట్ సారాంశం చూస్తే.. "మనం నిజాయితీగా కష్టపడితే, ఆ ఫలితం ఎప్పుడూ బాగుంటుంది" అనే అర్థం వచ్చేలా ఉంది. ఇది చూడగానే చాలామందికి అనేక సందేహాలు కలిగాయి. పెళ్లి రోజే ఇలాంటి ఫిలాసఫికల్ కోట్ ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అంటూ కామెంట్స్ సెక్షన్ లో ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ అసలు విషయం వేరే ఉంది.
చైతన్య పెట్టిన ఈ పోస్ట్ కు, సమంత పెళ్లికి అస్సలు సంబంధం లేదు. ఆయన నటించిన వెబ్ సిరీస్ 'దూత' విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పోస్ట్ పెట్టారు. 2023 డిసెంబర్ 1న ఈ సిరీస్ విడుదలై మంచి విజయం సాధించింది. ఆ విజయాన్ని గుర్తుచేసుకుంటూ, మంచి కథను ఎంచుకుని నిజాయితీగా ప్రయత్నిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడమే ఆయన ఉద్దేశం.
ఈ టైమింగ్ యాదృచ్ఛికమే అయినా, సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
కొందరు ఫ్యాన్స్ 'దూత' సిరీస్ చాలా బాగుందని, సీజన్ 2 ఎప్పుడొస్తుందని అడుగుతుంటే, మరికొందరు మాత్రం అనవసరంగా దీన్ని పర్సనల్ లైఫ్ కు లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చైతన్య మాత్రం చాలా క్లియర్ గా తన ప్రొఫెషనల్ లైఫ్ గురించే మాట్లాడారు. ప్రస్తుతం చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పర్సనల్ లైఫ్ లో ఎన్ని రూమర్స్ వచ్చినా, చైతన్య మాత్రం తన పూర్తి ఫోకస్ సినిమాల మీదే పెట్టారని ఈ పోస్ట్ మరోసారి నిరూపించింది. సమంత పెళ్లికి, ఈ పోస్ట్ కు ముడిపెట్టడం కేవలం నెటిజన్ల అతి ఆశే తప్ప, అందులో నిజం లేదని తేలిపోయింది.
