ఓటీటీని టార్గెట్ చేసిన చైతన్య.. దూత2 వెనుక అసలు స్ట్రాటజీ ఇదేనా?
అందులో భాగంగానే ఆయన సూపర్ హిట్ వెబ్ సిరీస్ దూతకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న దూత2 ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 9 Jun 2026 8:00 PM ISTఅక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం కెరీర్‌లో ఆసక్తికరమైన దశలో ఉన్నారు. ఒకవైపు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న వృష కర్మ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో థియేటర్లను టార్గెట్ చేస్తుండగా, మరోవైపు ఓటీటీ మార్కెట్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన సూపర్ హిట్ వెబ్ సిరీస్ దూతకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న దూత2 ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
రీసెంట్ గానే ఈ సిరీస్ రెండో సీజన్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నటి భూమిక కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. గతంలో సవ్యసాచి సినిమాలో నాగ చైతన్యతో కలిసి నటించిన భూమిక, ఇప్పుడు మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.
దూత తొలి సీజన్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రింట్ మీడియా నేపథ్యాన్ని హారర్ థ్రిల్లర్ అంశాలతో మేళవించి డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ రూపొందించిన కథనం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠను కొనసాగిస్తూ చివరి వరకు ఆసక్తిని నిలబెట్టిన విధానం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రెండో సీజన్‌లో మాత్రం పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి విక్రమ్ సిద్ధమవుతున్నారని సమాచారం. మొదటి సీజన్‌కు భిన్నమైన కథా ప్రపంచం, కొత్త మిస్టరీ ఎలిమెంట్స్, మరింత డార్క్ టోన్‌తో దూత2 రూపొందనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరోవైపు నాగ చైతన్య- విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ కూడా ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా మారుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన థాంక్యూ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, దూత వెబ్ సిరీస్ మాత్రం ఈ ఇద్దరి కాంబోకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా చైతన్యను కొత్త తరహా పాత్రలో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
అంతేకాదు, దూత2 నాగ చైతన్యకు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కావడం విశేషం. తన కెరీర్‌లో తొలి నిర్మాణ ప్రయత్నాన్ని ఓ వెబ్ సిరీస్‌తో ప్రారంభించడం ద్వారా ఓటీటీ రంగంలో కూడా తన స్థాయిని మరింత బలోపేతం చేసుకోవాలని చైతన్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో వృష కర్మతో, ఓటీటీలో దూత2తో రెండు వేర్వేరు మార్కెట్లను టార్గెట్ చేస్తూ ఆయన ముందుకు సాగుతున్న తీరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సరైన కథలు, సరైన ప్లాట్‌ఫామ్‌ల ఎంపికతో నాగ చైతన్య తన కెరీర్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
