Begin typing your search above and press return to search.

త‌మ్ముడి విజ‌యంపై చైతూ ఆనందోత్సాహం.. ఫ్యాన్స్ కేరింతలు!

అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం నెలకొంది.

By:  Sivaji Kontham   |   19 July 2026 11:18 AM IST
త‌మ్ముడి విజ‌యంపై చైతూ ఆనందోత్సాహం.. ఫ్యాన్స్ కేరింతలు!
X

అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం నెలకొంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అఖిల్ ఖాతాలో ఒక భారీ సక్సెస్ పడటంతో అక్కినేని ఫ్యాన్స్ థియేటర్ల వద్ద కేరింతలు కొడుతున్నారు. ముఖ్యంగా తమ్ముడి విజయాన్ని చూసి అన్నయ్య నాగచైతన్య ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య పబ్లిక్‌లో మాట్లాడిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.''తమ్ముడి సినిమా లెనిన్ ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్'' అంటూ చైతూ ఎంతో ఎమోషనల్‌గా కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో అన్నయ్య నాగచైతన్య నటించిన సినిమాలు విజయం సాధించినప్పుడు తమ్ముడు అఖిల్ ఇలాగే ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్న రోజులను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నదమ్ముల బంధానికి ప్రతీకగా.. తమ్ముడి విజయాన్ని చూసి చైతూ అంతే ఆనందాన్ని పంచుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్' విజయాన్ని మనసారా ఆస్వాధిస్తుండగా... అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ అనుబంధం అక్కినేని అభిమానుల మనసులను గెలుచుకుంటోంది.

ఇదే తరుణంలో అఖిల్ అక్కినేని వ్యక్తిగత జీవితంలో జరిగిన సానుకూల మార్పులను కూడా అభిమానులు ప్రస్తావిస్తున్నారు. అఖిల్ జీవితంలోకి అతడి భార్య జైనబ్ అడుగుపెట్టిన తర్వాతే అతడి ఫేట్ (అదృష్టం) మారిందని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. జైనబ్ రాకతో అఖిల్ కెరీర్‌కు కలిసివచ్చిందని... ఈ విజయంతో అక్కినేని కుటుంబంలో సరికొత్త జోష్.. కొత్త వెలుగులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అక్కినేని కుటుంబ వారసత్వం కారణంగా అఖిల్ ఎదుర్కొన్న ఒత్తిడి గురించి కింగ్ నాగార్జున ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఓపెన్ అయ్యారు. తన కెరీర్ ప్రారంభంలో కూడా తాను ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. అఖిల్ గత సినిమాల తాలూకు వైఫల్యాల గురించి మాట్లాడుతూ.. ప్రతి సినిమా కోసం అఖిల్ తన సర్వస్వాన్ని ధారపోసినా ఫలితాలు నిరాశపరచడం అతడిని మానసికంగా ఎంతో బాధించిందని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ప‌రాజ‌యాల‌తో పుట్టుకొచ్చిన బాధలోంచి వ‌చ్చిన ప‌రిణ‌తితో అత‌డు అద్భుతంగా న‌టించి అభిమానుల‌కు ఇప్పుడు బ‌లంగా క‌నెక్ట‌య్యాడు అని నాగ్ అన్నారు.

ఎన్నో ఒడిదుడుకుల తర్వాత వచ్చిన ఈ సాలిడ్ సక్సెస్ అఖిల్‌కు ఇండస్ట్రీలో ఒక బలమైన పునాదిని ఇచ్చింది. `లెనిన్` ఇచ్చిన భారీ విజయంతో అక్కినేని క్యాంప్‌లో ప్రస్తుతం మాంచి ఊపు కనిపిస్తోంది. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ.. మునుముందు అఖిల్ తన తదుపరి సినిమాలను ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తాడో.. ఎలాంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.