Begin typing your search above and press return to search.

జక్కన్ననే కాదు.. నాగి కూడా..

అందులో రామాయణానికి సంబంధించిన అంశాలు ఉండనున్నాయి. ఆ సినిమా ద్వారా జక్కన్న మరోసారి మైథాలజీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది.

By:  M Prashanth   |   4 April 2026 7:00 AM IST
జక్కన్ననే కాదు.. నాగి కూడా..
X

టాలీవుడ్‌ లో మైథాలజీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమాలపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు ఆ జానర్‌ ను రిస్కీగా భావించిన దర్శకులు, ఇప్పుడు అదే అంశాన్ని ఆధునిక టెక్నాలజీతో మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆ మార్పుకు ప్రధాన కారణంగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, మైథాలజీకి కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి.

బాహుబలి, మగధీర, యమదొంగ వంటి చిత్రాల్లో భారతీయ ఇతిహాసాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రామాయణం, మహాభారతం వంటి మహాకావ్యాల స్ఫూర్తితో కథలు నిర్మిస్తూ, వాటిని మోడ్రన్ టెక్నాలజీతో ప్రేక్షకులకు చేరవేయడంలో రాజమౌళి ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. అదే సమయంలో మైథాలజీ సినిమాలపై పెరుగుతున్న ఆసక్తి గుర్తించిన ప్రస్తుత జనరేషన్ దర్శకులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

అందులో ముఖ్యంగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు ముందుంటుంది. ఆయన తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ చిత్రం మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌ తో మిక్స్ చేసిన కొత్త ప్రయత్నంగా నిలిచింది. ఆ సినిమాలో భవిష్యత్తు నేపథ్యాన్ని తీసుకున్నప్పటికీ, కథలోని కీలక భాగాలు మహాభారతం, హిందూ పురాణాల ప్రభావంతో నడుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ లో మైథాలజికల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

విజువల్ ఎఫెక్ట్స్, కథనం, క్యారెక్టరైజేషన్ లో ఆయన చూపించిన క్రియేటివిటీ ప్రేక్షకులను విభిన్న అనుభూతికి గురిచేసింది. పూర్తిగా పురాణాలపై ఆధారపడకుండా, వాటి స్ఫూర్తితో కొత్త ప్రపంచాన్ని సృష్టించడం నాగ్ అశ్విన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుతోని వారణాసి ప్రాజెక్ట్ కూడా మైథాలజీ టచ్‌ తో కూడిన భారీ యాక్షన్ అడ్వెంచర్‌ గా ఉండబోతుందన్నట్లు తెలుస్తోంది.

అందులో రామాయణానికి సంబంధించిన అంశాలు ఉండనున్నాయి. ఆ సినిమా ద్వారా జక్కన్న మరోసారి మైథాలజీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. మొత్తానికి, మైథాలజీ సినిమాలపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి దర్శకులను కొత్త ప్రయోగాలు చేసే జోష్ కలిగిస్తోంది. ఒకవైపు రాజమౌళి భారీ స్థాయిలో పురాణాలను ఆవిష్కరిస్తే.. మరోవైపు నాగ్ అశ్విన్ వాటిని ఫ్యూచర్ వరల్డ్ తో మిక్స్ చేస్తూ కొత్త దారిని చూపిస్తున్నారు.

అలా మైథాలజీ సినిమాల విషయానికి వస్తే ఇప్పటివరకు రాజమౌళి పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అదే దారిలో ముందుకు సాగుతూ తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఆ ఇద్దరు దర్శకుల ప్రయాణం చూస్తుంటే.. మైథాలజీ సినిమాల ట్రెండ్ టాలీవుడ్‌ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా ఆ జానర్‌ ను ఆదరిస్తుండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న కథలు తెరపైకి రావడం ఖాయం.