Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : నా సామి రంగ

By:  Tupaki Desk   |   14 Jan 2024 7:59 AM GMT
మూవీ రివ్యూ : నా సామి రంగ
X

నా సామి రంగ మూవీ రివ్యూ

నటీనటులు: అక్కినేని నాగార్జున - ఆషిక రంగనాథ్ - అల్లరి నరేష్ - రాజ్ తరుణ్ - నాజర్ - మిర్నా మేనన్ - రుక్సర్ దిల్లాన్ తదితరులు

సంగీతం: కీరవాణి

ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరథి

రచన: ప్రసన్న కుమార్ బెజావాడ

నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి

స్క్రీన్ ప్లే -దర్శకత్వం: విజయ్ బిన్నీ

కొన్నేళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన నా సామి రంగ ప్రోమోలు చూస్తే పక్కా పండగ సినిమాలా కనిపించింది. సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగ.. నాగ్ కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా. తెలుసుకుందాం పదండి.

కథ:

కిట్టయ్య (నాగార్జున) జగ్గయ్య తోట అనే ఊరిలో అనాథగా పెరిగిన కుర్రాడు. అతడికి తనలాగే అనాథగా పెరిగిన అంజి (అల్లరి నరేష్) అంటే ప్రాణం. ఆ ఊరి పెద్దమనిషి అయిన పెద్దయ్య (నాజర్) మాట కృష్ణయ్యకు శాసనం. చిన్నప్పటినుంచి తనెంతో ఇష్టపడిన వరాలు (ఆషిక)ను కిట్టయ్య పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమె కూడా కిట్టయ్యను ప్రేమిస్తుంది. కానీ కిట్టయ్యతో కూతురు పెళ్లి చేయడం ఇష్టం లేక ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో కిట్టయ్యకు దూరమై.. మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుంది వరాలు. కిట్టయ్య కూడా 10 ఏళ్లకు పైగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోతాడు. మరి వీళ్ళిద్దరిని కలపడానికి అంజి ఏం చేశాడు.. మరోవైపు పెద్దయ్య కుటుంబంతో కిట్టయ్యకు అనుకోకుండా తలెత్తిన వైరం ఎక్కడిదాకా వెళ్ళింది.. ఈ విషయాలు తెరమీద తెలుసుకోవాలి.

కథనం- విశ్లేషణ:

ఎనిమిదేళ్ల కిందట సోగ్గాడే చిన్నినాయనతో పండుగ సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించాడు అక్కినేని నాగార్జున. ఆ సినిమా ఆయనకు నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. కానీ తర్వాత నాగ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఈ మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయలేకపోయింది. చివరికి రెండేళ్ల కిందట సంక్రాంతికే వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజు సైతం నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు నాగార్జున మళ్ళీ సోగ్గాడే చిన్నినాయన తరహా పక్కా రూరల్ మాస్ రూరల్ డ్రామాతో వచ్చాడు. 'సోగ్గాడే..'ను అనుకరిస్తున్నట్టుగా అనిపించే నా సామి రంగ.. పండక్కి సూటయ్యే పైసా వసూల్ సినిమాలా అనిపిస్తుంది. ఒక విలేజ్ డ్రామాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కాకపోతే ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కొత్త కథ.. గొప్ప మలుపులు.. వావ్ అనిపించే అంశాలు లేకపోయినా రెండున్నర గంటలు టైం పాస్ చేయడానికి అయితే ఇందులో ఢోకా లేదు.

నా సామి రంగ ట్రైలర్ అంతా యాక్షన్ ప్రధానంగా సాగింది. ఇందులో హైలెట్ అయ్యేది యాక్షన్... విలేజ్ డ్రామానే అనిపించింది. కానీ నిజానికి ఈ సినిమాలో ప్రేక్షకులను ఎక్కువగా ఎంగేజ్ చేసేది హీరో హీరో హీరోయిన్ల ప్రేమ కథే. ఆషిక రంగనాథ్ లాంటి అందమైన.. మంచి హావభావాలు పలికించే అమ్మాయిని కథ అమ్మాయిని కథానాయక ఎంచుకోవడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. నాగార్జున 'సోగ్గాడే..' తరహాలోనే సాగే పాత్రను ఈజ్ తో చేసుకుపోగా.. తెర పైన కనిపించినప్పుడల్లా చూస్తూనే ఉండిపోవాలనిపించేలా ఆషిక తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేసింది. వయసు అంతరం ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ బాగానే పండింది. ఆహ్లాదకరంగా అనిపించే ప్రేమ కథ.. ఆ తర్వాతి డ్రామా ప్రేక్షకులను మెప్పిస్తాయి. మరోవైపు నాగార్జున - అల్లరి నరేష్ మధ్య బంధాన్ని కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. మిగతా అంశాలు పెద్దగా ఎంగేజ్ చేయకపోయినా.. ఈ పాత్రలు.. వీటి మధ్య డ్రామా సినిమాను నడిపిస్తాయి. రెండు ఊర్ల మధ్య గొడవ.. పండగ ప్రభల వ్యవహారం.. అవేవీ అంత ఆసక్తికరంగా అనిపించవు.

హీరో ఎలివేషన్స్ సీన్లు.. మిగతా సన్నివేశాలు కొంత మామూలుగా అనిపించినా తన నేపథ్య సంగీతంతో కీరవాణి వాటిని నిలబెట్టాడు. ప్రేక్షకుల ఉత్సాహం తగ్గకుండా చూడడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. విలన్ పాత్ర మొదట్లో క్యూరియస్ గా అనిపిస్తుంది కానీ.. రాను రాను అది దశ దిశ లేకుండా సాగుతుంది. ఆ పాత్రను ఇంకొంచెం ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉంటే.. నా సామిరంగ మంచి స్థాయిలో నిలబడేది. నాజర్ పాత్రను కూడా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ప్రధమార్ధంలో లవ్ ట్రాక్.. విలేజ్ డ్రామా.. కామెడీ సమపాళ్లలో నా సామిరంగ చక చకా సాగిపోతుంది. కానీ ద్వితీయార్థంలో ఆ ఊపు కొనసాగలేదు. పడుతూ లేస్తూ సాగే కథనం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అల్లరి నరేష్ పాత్రతో కథను మలుపు తిప్పడం బావుంది. అక్కడ ఎమోషన్ పండింది క్లైమాక్స్ హడావిడిగా లాగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో స్టాండ్ అవుట్ గా నిలిచే.. వావ్ అనిపించే ఎపిసోడ్లు అయితే లేవు. కానీ సినిమా పెద్దగా బోర్ కొట్టకుండా అలా అలా సాగిపోతుంది. సంక్రాంతి పండుగతో ముడిపడిన కథ కావడం.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీర్చిదిద్దడం.. మూడు ప్రధాన పాత్రలు ఆకట్టుకోవడం.. మంచి సంగీతం.. నా సామి రంగకు ప్లస్. ఈ పర్ఫెక్ట్ సినిమా కాదు కానీ పండక్కి సూటయ్యే సినిమా.నటీనటులు: నాగార్జున కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ మాస్ క్యారెక్టర్ వేసి మెప్పించాడు. ఆయన పాత్రలో నటనలో చాలావరకు సోగ్గాడే చిన్నినాయన ఛాయలు కనిపిస్తాయి. బాగా అలవాటైన పాత్రలా నాగ్ ఈజ్ తో నటించాడు. నాగ్ గెటప్.. గోదావరి పల్లెటూరి స్లాంగ్ అవి బానే కుదిరాయి. ఫన్.. యాక్షన్.. రొమాంటిక్ సీన్లలో బాగా చేసిన నాగ్.. ఎమోషనల్ సీన్లలో మాత్రం సాధారణంగా అనిపించాడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆమె అందం.. అభినయం కట్టి పడేస్తాయి. ఆషికా తెర మీద కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేం. అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుంది. అంజి పాత్రను అతను అలవోకగా చేసేశాడు. తన పాత్ర.. నటన చాలా సహజంగా అనిపిస్తాయి. రాజ్ తరుణ్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. మిర్ణా మేనన్ బాగానే చేసింది. రుక్సర్ పాత్ర.. నటన మొక్కుబడిగా సాగాయి. విలన్ పాత్రలో నటించిన కొత్త నటుడు పరవాలేదు. నాజర్ కు ఇలాంటి పెద్ద మనిషి పాత్రలు కొట్టిన పిండే.

సాంకేతిక వర్గం:

కీరవాణి మనసుపెట్టి చేసిన సినిమాలా అనిపిస్తుంది నా సామి రంగ. సినిమాలో అందరి కన్నా బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చింది కీరవాణినే. ఇలాంటి రూరల్ డ్రామాలు చాలా వాటికి పని చేసిన అనుభవంతో సినిమాకు చక్కగా సరిపోయే పాటలు.. నేపథ్య సంగీతం ఇచ్చారు కీరవాణి. మరీ చార్ట్ బస్టర్స్ అనలేం కానీ.. కొన్ని పాటలు వినసొంపుగా. కొన్ని హుషారుగా అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు ఊపు తెచ్చింది. శివేంద్ర దాశరథి విజువల్స్ సినిమా శైలికి తగ్గట్లుగా సాగాయి. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. బడ్జెట్ పరిమితులు తెలిసిపోతాయి. ప్రసన్న కుమార్ డైలాగ్స్ పల్లెటూరి శైలిలో సహజంగా బావున్నాయి. దర్శకుడు విజయ్ బిన్నీ వీక్ స్క్రిప్టు తెర మీద ఉన్నంతలో బాగానే ప్రెజెంట్ చేశాడు. కొత్త దర్శకుడు అయినా కొన్ని సీన్లు అనుభవజ్ఞుడిలా డీల్ చేశాడు. అదే సమయంలో అనుభవ లేమి కూడా కొన్ని చోట్ల కనిపించింది. ఒక ఫ్లోతో సినిమాను నడిపించలేకపోయాడు.

చివరగా: నా సామి రంగ.. రొటీనే కానీ ఎంటర్టైనింగ్

రేటింగ్: 2.75/5