Begin typing your search above and press return to search.

మైత్రీ సీక్వెల్స్.. లాభాల పంట పండేనా?

ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ కోట్లలో లాభాలు గడిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:47 PM GMT
మైత్రీ సీక్వెల్స్.. లాభాల పంట పండేనా?
X

తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం సీక్వెల్ మయం. దాదాపు 16 సినిమాల సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయట. అందులో కొన్ని ఇప్పటికే సెట్స్ పై ఉండగా.. మరికొన్ని త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు వస్తుండడంతో నిర్మాతలు కూడా.. ఇప్పటికే హిట్ అయిన చిత్రాలకు సీక్వెల్స్ కు సై అంటున్నారు.

అయితే టాలీవుడ్ లో ఈ సీక్వెల్స్ స్టార్ట్ చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళినే. బాహుబలి స్టోరీ అంతా ఒక సినిమాలో పట్టదని రెండు భాగాలుగా తీస్తున్నట్లు అప్పుడు చెప్పారు. కథను, క్యారెక్టర్స్ ను జస్టిఫై చేయలేమనే అలా చేస్తున్నట్లు కూడా తెలిపారు. బాహుబలిలో కొడుకు కథను.. బాహుబలి-2లో తండ్రి కథను చూపించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇక అప్పుడు మొదలైన సీక్వెల్ ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.

ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ కోట్లలో లాభాలు గడిస్తోంది. ఇప్పుడు మైత్రీ సంస్థ.. వరుస సీక్వెల్స్ ను తెరకెక్కిస్తోంది. అందులో ముఖ్యమైన పుష్ప-2 మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్.. ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ సంస్థ.. పుష్ప-2ను రూపొందిస్తోంది.

పుష్పతోపాటు నాలుగేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సీక్వెల్ ను కూడా మైత్రీ సంస్థ తెరకెక్కించనుంది. కీరవాణి కుమారుడు శ్రీ సింహ.. మత్తు వదలరా మూవీతోనే హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. అప్పట్లో ఈ మూవీ ప్రేక్షకులను నవ్వించడంతోపాటు సస్పెన్స్ తో చివరి వరకు కూడా సీట్లకు అతుక్కుపోయేలా చేసింది. ఇక సీక్వెల్ లో కూడా శ్రీసింహానే మళ్లీ హీరోగా కనిపించనున్నారు.

మరోవైపు, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్.. వరుస ప్లాపులతో సతమవుతున్న సమయంలో చిత్రలహరి మూవీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక ఫెయిల్యూర్ అబ్బాయి ప్రేమ కథ, మోటివేషన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించడానికి మైత్రీ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. మరి ఈ మూడు సీక్వెల్స్.. మైత్రీ సంస్థకు ఎంతటి లాభాలు కురిపిస్తాయో చూడాలి.