Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు మళ్లీ మైత్రీ దెబ్బ?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు రెండు దశాబ్దాలకు పైగా ప్రొడ్యూసర్‌గానే కాక డిస్ట్రిబ్యూటర్‌గానే తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు

By:  Tupaki Desk   |   7 April 2024 2:30 AM GMT
దిల్ రాజుకు మళ్లీ మైత్రీ దెబ్బ?
X

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు రెండు దశాబ్దాలకు పైగా ప్రొడ్యూసర్‌గానే కాక డిస్ట్రిబ్యూటర్‌గానే తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్లో ఆయనకు ఎదురు వెళ్లిన ఎవ్వరూ నిలబడలేకపోయారు. అభిషేక్ నామా, వరంగల్ శీను లాంటి వాళ్లు రాజును సవాల్ చేసి కొంత కాలం హవా నడిపించారు కానీ.. తర్వాత సైడ్ అయిపోయారు.

ఐతే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్లో రాజుకు ఎలాగైనా చెక్ పెట్టాలని మరో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను నడిపించే నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఫిక్స్ అయి. ఏడాదిన్నర కిందట సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నారు. సంక్రాంతికి తమ చిత్రాలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను నైజాంలో వాళ్లే రిలీజ్ చేసుకున్నారు.

ఐతే ఈ చిత్రాలకు మొదట థియేటర్ల సమస్య తప్పలేదు. రాజు నిర్మించిన డబ్బింగ్ సినిమా ‘వారసుడు’కు రాజు ఎక్కువ స్క్రీన్లు ఇచ్చుకోవడంపై వివాదం నడిచింది. ఐతే ఎంతైనా చిరు, బాలయ్యల సినిమాలు కావడంతో రాజు కొంత తగ్గక తప్పలేదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మైత్రీ అధినేతలకు మంచి ఫలితాలందించాయి. కానీ ఆ టైంలో రాజుకు, మైత్రీ అధినేతలకు మొదలైన ఘర్షణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ సంక్రాంతికి మైత్రీ అధినేతలు ‘హనుమాన్’ అనే చిన్న సినిమాను రిలీజ్ చేస్తే.. రాజు ‘గుంటూరు కారం’ను విడుదల చేశాడు. కానీ మళ్లీ థియేటర్ల దగ్గర సమస్య తప్పలేదు.

ఐతే హనుమాన్ సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో రోజులు గడిచేకొద్దీ స్క్రీన్లు దానికి పెరిగాయి. చివరికి మైత్రీ అధినేతలే గెలిచారు. రాజుకు ‘హనుమాన్’ దెబ్బ గట్టిగానే తగిలింది. ఇక వర్తమానంలోకి వస్తే.. ఈ వారం రాజు సంస్థ నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చింది. ఆ చిత్రానికి మంచి క్రేజే కనిపించింది. కానీ రిలీజ్ రోజు బాగా నెగెటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది.

ఇదే సమయంలో మైత్రీ అధినేతల నుంచి ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే డబ్బింగ్ మూవీ రిలీజైంది. రాజు సినిమాకు డివైడ్ టాక్ వస్తే.. దీనికి ముందు రోజు ప్రిమియర్స్ నుంచే మంచి టాక్ రావడంతో ఉదయం మార్నింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. కొన్ని చోట్ల ‘ఫ్యామిలీ స్టార్’కు దీటుగా నిలిచిందీ చిత్రం. చూస్తుంటే మరోసారి మైత్రీ అధినేతలు.. దిల్ రాజుపై పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తోంది.