Begin typing your search above and press return to search.

మైత్రీ సినిమాస్ - థియేటర్ బిజినెస్ లోకి అగ్ర నిర్మాతలు!

ఈ థియేటర్ ను రేపు శుక్రవారం మార్చి 29న గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నట్లు మైత్రీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   28 March 2024 6:26 PM GMT
మైత్రీ సినిమాస్ - థియేటర్ బిజినెస్ లోకి అగ్ర నిర్మాతలు!
X

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో 'మైత్రీ మూవీ మేకర్స్' ఒకటి. వై రవి శంకర్, నవీన్ యెర్నేని సారథ్యంలో నడిచే ఈ బ్యానర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నాయి. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. ఓవైపు పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే, మరోవైపు మీడియం రేంజ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న మైత్రీ నిర్మాతలు.. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోనూ అడుగుపెట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలను సొంతంగా రిలీజ్ చేసుకున్న నిర్మాతలు.. 'సలార్', 'హనుమాన్' వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలు ఆర్జించారు. ఈ క్రమంలో ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్క్రీన్లను లీజుకు తీసుకుని వాటిని పునరుద్ధరిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి మల్టీఫ్లెక్స్ ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

'మైత్రి సినిమాస్' పేరుతో గుంటూరులో ప్రపంచ స్థాయి 6 స్క్రీన్ల మల్టీఫ్లెక్స్ ను రెడీ చేశారు. ఈ థియేటర్ ను రేపు శుక్రవారం మార్చి 29న గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నట్లు మైత్రీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రేపటి నుంచి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నామని పేర్కొన్నారు. రేపు రిలీజ్ కాబోతున్న టిల్లు స్క్వేర్, ది గోట్ లైఫ్, గాడ్జిల్లా కాంగ్ సినిమాలతో పాటుగా ప్రేమలు, ఓం భీమ్ బుష్ చిత్రాల బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

"గుంటూరులోని సినీ ప్రేమికులందరికీ ఒక అద్భుతమైన వార్తను అందిస్తున్నాము. మైత్రి సినిమాస్ రేపు తెరవబడుతుంది. నగరపాలెంలోని ఫీనిక్స్ మాల్‌లో వరల్డ్ క్లాస్ 6 స్క్రీన్ మల్టీప్లెక్స్ అందుబాటులోకి రాబోతోంది. ఎక్స్ట్రార్డినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మంచి సౌకర్యాన్ని అందించడానికి వేచి చూస్తున్నాం" అని మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ పేర్కొన్నారు.

టాలీవుడ్ లో దిల్ రాజు, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా ఎగ్జిబిషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వారికి పోటీగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పంపిణీ రంగంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మేకర్స్.. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో ఏ మేరకు రాణిస్తారనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రస్తుతం 'పుష్ప 2', RC 16, 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి క్రేజీ చిత్రాలు రూపొందుతున్నాయి. ప్రభాస్ - హను రాఘవపూడి, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి. అలానే మలయాళంలో 'నడికర్ లాల్ జూనియర్', తమిళ్ లో 'గుడ్ బాడ్ అగ్లీ' మూవీస్ చేస్తున్నారు. ఇదే క్రమంలో త్వరలో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్ లాంటి స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నారు. ఇక 'ది గోట్ లైఫ్' 'మంజుమ్మెల్ బాయ్స్' లాంటి మలయాళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.