Begin typing your search above and press return to search.

మైత్రీ సినిమాల‌కు సౌండే లేదేంటి

శ్రీమంతుడు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట‌రైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్.

By:  Tupaki Desk   |   9 April 2025 4:00 PM IST
మైత్రీ సినిమాల‌కు సౌండే లేదేంటి
X

శ్రీమంతుడు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట‌రైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్న ఆ బ్యాన‌ర్ త‌ర్వాత కూడా పెద్ద హీరోల‌తో సినిమాలు చేసి వ‌రుస హిట్లు అందుకుంది. మ‌ధ్య‌లో కొన్ని యావ‌రేజ్, ఫ్లాపులు వ‌చ్చిన‌ప్పటికీ మైత్రీ బ్యాన‌ర్ లో స‌క్సెస్ రేటే ఎక్కువ‌.

త‌క్కువ కాలంలోనే టాలీవుడ్ లోని అగ్ర హీరోలంద‌రితో సినిమాలు చేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు త‌మ ప‌రిధిని పెంచుకోవ‌డానికి బాలీవుడ్, కోలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. అయితే ముందు ఒక ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయ్యాక మ‌రో ఇండ‌స్ట్రీకి వెళ్ల‌డం లాంటివి కాకుండా ఒకేసారి రెండు వేర్వేరు ప్రాజెక్టుల‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ కోలీవుడ్, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

స‌న్నీ డియోల్ తో క‌లిసి జాట్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఈ నిర్మాణ సంస్థ, అజిత్ తో చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ రెండు సినిమాల‌ను మైత్రీ నిర్మాత‌లు న‌వీన్, ర‌వి శంక‌ర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. మామూలుగా మైత్రీ నుంచి సినిమా వ‌స్తుందంటే వారి ప్ర‌మోష‌న్స్ కు అంద‌రూ ఇంప్రెస్ అవుతూ ఉంటారు.

కానీ ఇప్పుడు ఆ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల‌కు మాత్రం వారు ఎలాంటి ప్ర‌మోష‌న్స్ చేయ‌డం లేదు. అస‌లు ఈ సినిమాలు ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నాయ‌నే విష‌యం కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా మందికి తెలియ‌దు. జాట్ తెలుగు రిలీజ్ లాస్ట్ మినిట్ లో ఆగింది కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం రిలీజ‌వుతోంది.

ఈ రెండు సినిమాలకు ప్ర‌మోష‌న్స్ స‌రిగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే తెలుగు రాష్ట్రాల్లో ఆయా సినిమాల‌పై బ‌జ్ లేదు. అయితే నిర్మాత‌లు సినిమాను ఎంత ప్ర‌మోట్ చేద్దామ‌ని చూసిన‌ప్ప‌టికీ సినిమాల్లోని కీల‌క న‌టులు ఇంట్రెస్ట్ చూపించ‌క‌పోవ‌డంతో చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు. ప్ర‌మోష‌న్స్ గురించి వ‌దిలేసి రిజ‌ల్ట్ ఎలా వ‌స్తుందా అని ఎదురుచూస్తున్న మేక‌ర్స్ ఈ సినిమాలు ఆయా భాష‌ల్లో వ‌ర్క‌వుట్ అయితేనే నిర్మాతలు త‌మ పెట్టుబ‌డుల‌ను తిరిగి పొందే ఛాన్సుంది. కొంచెం అటూ ఇటూ అయినా భారీ న‌ష్టాలు త‌ప్ప‌వు.