వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ లో పుష్ప నిర్మాతలు.. ఎందుకంటే?
టాలీవుడ్ లో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటే.. అందులో మైత్రి మూవీ మేకర్స్ ప్రధానంగా ఉంటుంది.
By: Tupaki Desk | 9 July 2025 4:08 PM ISTటాలీవుడ్ లో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటే.. అందులో మైత్రి మూవీ మేకర్స్ ప్రధానంగా ఉంటుంది. శ్రీమంతుడు సినిమాతో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే బిగ్ ప్రొడక్షన్ గా ఎదిగింది. గ్యాప్ లేకుండా ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయగల నిర్మాతలు వారు. ఇక ఇటీవల పుష్ప 2తో పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ హిట్ అందుకున్నారు. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో మరిన్ని బిగ్ సినిమాలను లైన్ లో పెడుతున్నాయి.
కానీ ఇండస్ట్రీలో టాప్ బ్యానర్‌గా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఏ ఒక్క ఫిజికల్ ఆఫీస్ లేకుండా పనిచేస్తోంది అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఇదే వాస్తవమని తెలుస్తోంది. తమ బేనర్ కింద ప్రస్తుతం పలు పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా.. మైత్రీకు ఓ సరైన కార్యాలయం లేదన్నదే తాజాగా బయటకు వచ్చిన టాక్. ఇప్పటి వరకు మైత్రీ బేనర్ జూబ్లీహిల్స్‌లో ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు.
కానీ ఆ భవనం నిర్మాత ప్రశాంతి తిపిరినేని సొంతం కావడం విశేషం. ఆమె ‘వాల్ పోస్టర్ సినిమా’, ‘యూనానిమస్’ వంటి సంస్థలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా మైత్రీ టీంను ఆ భవనం ఖాళీ చేయమని చెప్పినట్టు ఉన్నారు. చివరకు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం కూడా ప్రశాంతి ఇతర ప్రాజెక్టులు హ్యాండిల్ చేస్తుండటంతో ఆమెకి మరింత స్థలం అవసరం కావడంతో మైత్రీకి ఇక అక్కడ చోటు లేదు.
ఇదే మైత్రీ మేకర్స్ 2020 ప్రాంతంలో ఉప్పెన, సర్కారు వారి పాట వంటి సినిమాల కోసం మరో కార్యాలయం ఉపయోగించారు. అది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబానికి చెందిన భవనం. కొన్ని నెలల పాటు ఆఫీస్‌గా వాడిన ఆ ఇంటిని తర్వాత ఖాళీ చేయగా, ఇప్పడు ఆ ఇంట్లో మెగా హీరో వరుణ్ తేజ్ ఉంటున్నారు. అంతేకాదు, అదిరిపోయే ఇంటీరియర్స్‌తో ఆ ఇంటిని తీర్చిదిద్దారట.
ప్రస్తుతం మైత్రీ సంస్థ తమకు ఓ పర్మనెంట్ ఆఫీస్ ఉండాలనే దిశగా సొంత భవనం నిర్మించడానికి ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఆ పని పూర్తవడానికి సమయం పడనుంది. అప్పటివరకు మైత్రీ టీమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో లేదా ఇతర తాత్కాలిక లొకేషన్లలోనే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. ఇన్ని పెద్ద సినిమాలు లైన్లో ఉన్నప్పటికీ.. ఇలాంటీ సౌకర్యాలు లేకపోవడం చిన్న విషయం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ నీల్ లాంటి భారీ ప్రాజెక్టులు మైత్రీ చేతిలో ఉన్నాయి. అలాంటి స్థాయిలో ఉన్న సంస్థకు ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇక త్వరలోనే మైత్రీ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని అంచనా.
