ఇలాంటి ఘనత మైత్రీకే చెల్లింది
మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్ లోని అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇది కూడా ఒకటి.
By: Tupaki Desk | 31 May 2025 4:23 PM ISTమైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్ లోని అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇది కూడా ఒకటి. మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది. కేవలం హిట్ అందుకోవడమే కాకుండా మొదటి సినిమాతోనే మంచి అభిరుచి ఉన్న నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు.
శ్రీమంతుడు తర్వాత రెండో సినిమాగా ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమా తీసి ఆ సినిమాతో కూడా హిట్ ను అందుకున్నారు. ఇక మూడో సినిమాగా రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి క్లాసిక్ సినిమాను తీసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నిర్మాతలుగా పేరు సంపాదించారు. కెరీర్ స్టార్టింగ్ లోనే టాలీవుడ్ లోని ముగ్గురు స్టార్ హీరోలకు కెరీర్ బ్లాక్ బస్టర్లుగా ఇచ్చిన నిర్మాణ సంస్థగా కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిలిచింది.
అంతేకాదు ఆ తర్వాత ఉప్పెన లాంటి సినిమాతో పంజా వైష్ణవ్ తేజ్ కు బ్లాక్ బస్టర్ డెబ్యూ ను ఇవ్వడమే కాకుండా ఆ సినిమాతో నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ నాలుగు సినిమాలకూ గానూ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తొలి తెలంగాణ రాష్ట్ర గద్దర్ అవార్డులను అందుకుంది. 2015 సంవత్సరానికి గానూ శ్రీమంతుడు సినిమా మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకోగా, 2016 సంవత్సరానికి గానూ జనతా గ్యారేజ్ మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు, 2018కి గానూ రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా రంగస్థలం, 2021సంవత్సరానికి థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెనకు రాష్ట్ర అవార్డులను కూడా గెలుచుకుంది.
కేవలం బ్లాక్ బస్టర్లు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా గెలుచుకోవడం మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థకే చెల్లింది. టాలీవుడ్ నిర్మాణ సంస్థగా జర్నీని స్టార్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు దేశంలోనే భారీనిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తమ సినిమాలను అవార్డులిచ్చి గుర్తించడం తమకెంతో సంతోషంగా ఉందని, ఈ ఆనందంతో మరిన్ని పెద్ద సినిమాలను అందించడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్‌నీల్, జై హనుమాన్ సినిమాలతో పాటూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి.
