Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: APలో సినీ హబ్ నిర్మాణానికి సినీ ప్ర‌ముఖుల ఆస‌క్తి!

నూతన రాజధానిలో సినిమా హబ్‌ను ఏర్పాటు చేసేందుకు వస్తున్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ప్రస్తుతం చాలా సానుకూలంగా పరిశీలిస్తోంది.

By:  Sivaji Kontham   |   30 May 2026 1:28 PM IST
టాప్ స్టోరి: APలో సినీ హబ్ నిర్మాణానికి సినీ ప్ర‌ముఖుల ఆస‌క్తి!
X

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు.. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలో అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోలు, అధునాతన డిజిటల్ ల్యాబ్స్ - కళా కేంద్రాల (క‌ల్చ‌ర‌ల్ హ‌బ్స్) స్థాపన కోసం ముంబై (బాలీవుడ్) సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, బహుళజాతి నిర్మాణ సంస్థలు(ఎంఎన్‌సిలు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. నూతన రాజధానిలో సినిమా హబ్‌ను ఏర్పాటు చేసేందుకు వస్తున్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ప్రస్తుతం చాలా సానుకూలంగా పరిశీలిస్తోంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం.. అలాగే ఇటీవ‌ల వ‌చ్చిన కొన్ని మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టడానికి బాలీవుడ్ అగ్ర నటులు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. గతంలోనే ప్రముఖ స్టార్ హీరో - నిర్మాత అక్షయ్ కుమార్ అమరావతిలో అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో, షూటింగ్ లొకేషన్ల నిర్మాణం కోసం స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులను సంప్రదించి తన ఆసక్తిని వ్యక్తపరిచారు. ఆయనతో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ `పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్` అధినేతలు జాకీ భగ్నానీ తదితరులు ఇక్కడ సరికొత్త ప్రొడక్షన్ హౌస్, పోస్ట్-ప్రొడక్షన్ డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటుకు ప్రాథమిక చర్చలు జరిపారు. అలాగే భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజిక్ అండ్ సినిమా నిర్మాణ సంస్థ అయిన `టీ-సిరీస్` అధినేత భూషణ్ కుమార్ సైతం మ్యూజిక్ అకాడమీలతో పాటు స్టూడియో కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు రాగా, యశ్ రాజ్ ఫిలిమ్స్ లేదా పీవీఆర్-ఐనాక్స్ స‌హా, ముంబై కార్పొరేట్ స్టూడియో లైన్ల ప్రతినిధులు కూడా అమరావతిలో సరికొత్త కళా కేంద్రాల ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారని తెలుస్తోంది.

మరోవైపు అమరావతి ప్రతిపాదనలతో పాటు ముంబైకి చెందిన మరికొందరు సెలబ్రిటీలు ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ప్రధాన సినీ కేంద్రంగా స్థిరపడిన హైదరాబాద్ సినీ హబ్ (ఫిలింనగర్, రామోజీ ఫిలింసిటీ పరిసరాలు) లో కూడా తమ పెట్టుబడులను విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌కు చెందిన ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ NY VFXWAALA హైదరాబాద్‌లో తన డిజిటల్ స్టూడియోను మరింత విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. వీటితో పాటు దక్షిణాది సినిమాలతో మమేకమవుతున్న తరుణంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన `ధర్మా ప్రొడక్షన్స్` సైతం హైదరాబాద్ కేంద్రంగా సంయుక్త నిర్మాణ భాగస్వామ్యాల కోసం ఇక్కడ కార్యాలయాలు, స్టూడియో లీజుల కోసం సంప్రదింపులు జరుపుతుండటం విశేషం.

అమరావతిలో సినిమా స్టూడియోలు, కళా కేంద్రాల నిర్మాణానికి భూములు కేటాయించాలని ముంబై సినీ ప్రతినిధులు కోరినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అత్యంత పారదర్శకంగా.. కఠినంగా వ్యవహరిస్తోంది. కేవలం సినీ సెలబ్రిటీల పేరు లేదా వారి బ్రాండ్ ఇమేజ్ చూసి విలువైన రాజధాని భూములను కేటాయించడం కుదరదని ఏపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. స్టూడియోల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రతి నటుడు, నిర్మాత లేదా సంస్థ తమకు సంబంధించిన పూర్తి ఫైనాన్సియల్ షీట్స్, బ్యాలెన్స్ షీట్లను ప్రభుత్వానికి సమర్పించాలని గట్టి నిబంధన విధించింది.

ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా సదరు సంస్థల నిజమైన ఆర్థిక సామర్థ్యం.. గతంలో వారు విజయవంతంగా చేపట్టిన ప్రాజెక్టుల ట్రాక్ రికార్డ్‌ను ప్రభుత్వ కమిటీ పూర్తిగా పరిశీలించనుంది. అన్ని రకాలుగా అర్హత సాధించి.. నిజంగానే పెట్టుబడి పెట్టగల నమ్మకం ఉన్న సంస్థల వివరాలను మాత్రమే ముఖ్యమంత్రి (సీఎం) చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వద్దకు తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత సీఎంతో జరిపే తుది చర్చల ఆధారంగానే అమరావతిలో భూముల కేటాయింపుపై ప్రభుత్వం ఒక క‌చ్ఛితమైన నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం ఈ ముందుచూపు వల్ల అమరావతిలో కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రాజెక్టులు కాకుండా.. త్వరితగతిన పూర్తయ్యే నిజమైన సినీ పారిశ్రామిక హబ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో ఏపీ-ఎఫ్‌.డి.సిలో ప‌ని చేస్తున్న ప్ర‌ముఖ వ్య‌క్తి వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌స్తుతం అమ‌రావ‌తి లేదా విశాఖ‌లో ప‌లువురు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని ప్ర‌భుత్వ అనుమ‌తులు, సానుకూల‌త‌ల‌ను బ‌ట్టి నిర్మాణాల‌కు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. (సూచ‌న‌: ఇటీవ‌లి ప‌లు మీడియా క‌థ‌నాల ఆధారంగా సేక‌రించిన స‌మాచారం ఇది. అధికారికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, ఎఫ్‌.డి.సి నుంచి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డాల్సి ఉంది.