ఫ్లాప్ దర్శకుడి పాట్లు... ఆ సినిమా కోసం ఫీట్లు
గజిని, స్టాలిన్, తుపాకి, కత్తి వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న మురుగదాస్ ఈ మధ్య కాలంలో తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు
By: Tupaki Desk | 1 Jun 2025 10:30 AM ISTగజిని, స్టాలిన్, తుపాకి, కత్తి వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న మురుగదాస్ ఈ మధ్య కాలంలో తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు. ఈయన సరైన హిట్ కొట్టి దశాబ్ద కాలం అయింది. ఆ మధ్య కాలంలో బాలీవుడ్‌కి వెళ్లిన మురుగదాస్ అక్కడ కూడా నిరాశ పరిచాడు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్‌తో చేసిన 'సికిందర్' సినిమాతో మురుగదాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలాంటి సినిమాను ఎలా తీశార్రా బాబు అంటూ ప్రేక్షకులు తీవ్రంగా విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం చేయాల్సిన కథ, కథనంతో సికిందర్ తీశాడు అంటూ మురుగదాస్‌ను చాలా మంది ట్రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ ఎలా ఈ కథకు ఓకే చెప్పాడు అంటూ కొందరు కామెంట్ చేశారు.
మహేష్ బాబుతో 'స్పైడర్', సల్మాన్ ఖాన్‌తో 'సికిందర్', రజనీకాంత్‌తో 'దర్బార్' సినిమాలను చేసిన మురుగదాస్ మినిమం సక్సెస్‌లను సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. అంత పెద్ద స్టార్స్‌తో చేసే అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేక పోవడం అనేది మురుగదాస్ దురదృష్టం అంటూ చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. సికిందర్ సినిమా చేస్తున్న సమయంలోనే శివ కార్తికేయన్‌తో 'మదరాసి' సినిమాను చేసే అవకాశం ను మురుగదాస్ దక్కించుకున్నాడు. సికిందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో మదరాసి సినిమా విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. శివకార్తికేయన్ సినిమాకు పాజిటివ్ ఎలిమెంట్ అయినా మురుగదాస్ టేకింగ్ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉంది.
ఈ మధ్య కాలంలో శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. అలాంటి శివ కార్తికేయన్ ఫ్లాప్ దర్శకుడు అయిన మురుగదాస్‌తో సినిమాను చేసేందుకు ఒప్పుకోవడం పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ మొదటి నుంచి ఆయన అభిమానులు మాత్రమే కాకుండా పలువురు సినీ వర్గాల వారు, మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందరి అంచనాలను తారు మారు చేస్తూ మదరాసి సినిమాను సూపర్ హిట్ చేయాలనే పట్టుదలతో దర్శకుడు మురుగదాస్ పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం పడరాని పాట్లు పడుతున్నాడు అంటూ తమిళ సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మదరాసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. తాజాగా సినిమా క్లైమాక్స్ షూట్ చేసినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ క్లైమాక్స్ ను శ్రీలంకలో షూట్ చేశారని, సినిమాకే హైలైట్‌గా క్లైమాక్స్ నిలుస్తుందని మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. మురుగదాస్ గతంలో చేసిన సూపర్ హిట్ సినిమాల తరహాలో మదరాసి సినిమా ఉంటుంది అంటూ తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మదరాసి సినిమాకు పబ్లిసిటీ కల్పించేందుకు మురుగదాస్ అండ్ టీమ్ చాలా ఫీట్లు చేస్తున్నారు. మరి మురుగదాస్ ప్రయత్నాలు సఫలం అయ్యేనా... సినిమాకు బజ్ క్రియేట్ అయ్యి వసూళ్లు దక్కేనా అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.
