'సూపర్ హీరోయిజం' కాదు వ్యక్తిత్వం ముఖ్యం.. ఈ సీనియర్ నటుడే ఆదర్శం!
సినిమా రంగంలో నటుడిగా అత్యున్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా.. నిర్మాతగా అభిరుచితో కూడుకున్న సినిమాలను అందించారు మురళిమోహన్.
By: Sivaji Kontham | 30 Jun 2026 10:28 AM ISTసినిమా రంగంలో నటుడిగా అత్యున్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా.. నిర్మాతగా అభిరుచితో కూడుకున్న సినిమాలను అందించారు మురళిమోహన్. తన సీనియర్ నటుడు శోభన్ బాబు సలహాతో రియల్ ఎస్టేట్ (జయభేరి) రంగంలోకి ప్రవేశించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన మురళీ మోహన్.. తన సంపాదనను కేవలం వ్యాపార విస్తరణకే పరిమితం చేయకుండా వెయ్యి మందికి పైగా విద్యార్థులకు విద్యాదానం చేయడం... 86 ఏళ్ల వయసులోనూ నటనపై మక్కువ చూపడం అనేది నేటితరం సెలబ్రిటీలకు లార్జర్-దేన్-లైఫ్ ఇమేజ్ కంటే సామాజిక బాధ్యత, వ్యక్తిగత క్రమశిక్షణే ముఖ్యమని నిరూపించింది. మేటి నటుడు, నిర్మాత, నాయకుడు మురళీ మోహన్ జీవిత ప్రయాణం నేటి తరం నటీనటులకు, స్టార్స్‌కు ఒక అద్భుతమైన రోల్ మోడల్ (మార్గాదర్శకం) అని చెప్పవచ్చు.
లార్జర్-దన్-లైఫ్ ఇమేజ్ కంటే 'క్యారెక్టర్' ముఖ్యం
నేటితరం సెలబ్రిటీలు చాలామంది తమ స్క్రీన్ ఇమేజ్, సోషల్ మీడియా పబ్లిసిటీ, లైమ్‌లైట్‌లో ఉండటంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. కానీ మురళీ మోహన్ ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ వివాదాలకు దూరంగా .. `అజాతశత్రువు`గా నిలిచారు. `నోటి నుంచి వచ్చే మాటే మన క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుంది` అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆయన.. స్టార్‌డమ్ అనేది తాత్కాలికమని.. వ్యక్తిగత క్రమశిక్షణ.. మచ్చలేని వ్యక్తిత్వమే శాశ్వతమని నిరూపించారు.
సంపాదన - సామాజిక బాధ్యత-విద్యాదానం:
చాలామంది వ్యాపారవేత్తలు లేదా సెలబ్రిటీలు తమ సంపాదనను కేవలం ఆస్తుల విస్తరణకు, లగ్జరీ జీవితానికే పరిమితం చేస్తారు. అయితే మురళీ మోహనుడు దిగ్గజ నటుడు శోభన్ బాబు సలహాతో రియల్ ఎస్టేట్ (జయభేరి) రంగంలో ఎంత సంపాదించినా.. ఇప్పటికీ ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ `సింపుల్ లైఫ్` లీడ్ చేస్తున్నారు.
``కుడిచేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకూడదు`` అన్నట్లు.. వెయ్యి మందికి పైగా పేద విద్యార్థుల చదువు కోసం ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల వరకు ఖర్చు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. పబ్లిసిటీ కోసం కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాలనే బాధ్యతతో ఆయన చేసిన విద్యాదానం ఎంతో గొప్పది. కేవలం డబ్బు సంపాదించడమే సక్సెస్ కాదని, ఆ డబ్బుతో ఎంతమంది జీవితాలను మార్చామనేదే నిజమైన సక్సెస్ అని ఆయన జీవితవిధానం చెబుతోంది.
వయసుతో నిమిత్తం లేని నటనపై మక్కువ:
86 ఏళ్ల వయసులో.. అన్ని రకాల ఆర్థిక వనరులు, లగ్జరీ జీవితం అందుబాటులో ఉన్నా.. ఆయన ఇంకా షూటింగ్‌లలో పాల్గొంటూ నటిస్తూనే ఉన్నారు. ఇది ఆయనకు సినిమా రంగంపై, నటనపై ఉన్న అపారమైన గౌరవాన్ని, మక్కువను చూపిస్తుంది. ప్రస్తుతం ఆయన జెన్ జీతో కలిసి పని చేస్తున్నారు. రిటైర్మెంట్ అనేది వయసును బట్టి రాదని... మనసులోని ఉత్సాహాన్ని బట్టి ఉంటుందని ఆయన నిరూపిస్తున్నారు.
`పద్మశ్రీ` ఆయన అర్హతకు దక్కిన గౌరవం
మురళీ మోహన్ జీవితం నేటితరం సెలబ్రిటీలకు ఒక పక్కా గైడ్ లాంటిది. కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ మాత్రమే ఒక స్టార్‌ను గొప్పవారిని చేయవు. సమాజంపై ఉన్న కృతజ్ఞత, వినయం, వ్యాపారంలో నిజాయితీ, జీవితాంతం కొనసాగే క్రమశిక్షణే ఒక నటుడిని సమాజంలో `పద్మశ్రీ` వంటి అత్యున్నత పురస్కారాలకు అర్హుడిని చేస్తాయని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు మాగంటి మురళీ మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక `పద్మశ్రీ` అవార్డుతో గౌరవించింది. ఈ అరుదైన పురస్కారం అందుకున్న సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (FCA) ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్‌లో మురళీ మోహన్‌తో ప్రత్యేకంగా `మీట్ ది ప్రెస్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్, గౌరవ అధ్యక్షులు ప్రభు, సెక్రటరీ సురేష్ కొండేటి తదితర సభ్యులు బొకేలతో ఘనంగా సన్మానించారు. నేటితరానికి ఆయన జీవితం ఒక ఆదర్శం అని క్రిటిక్స్ అభినందించారు.
