రేపు ఆయన ఇండస్ట్రీకే మొగుడవుతాడని చెప్పాను: మురళీమోహన్
టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్ ఇటీవల జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 12 Oct 2026 9:17 AM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్ ఇటీవల జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో తన దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, `మన ఊరు పాండవులు` సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనలోని ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డాన్సులు , ఫైటింగ్‌ల శైలి చూసి ఈనాడు ఇండస్ట్రీలో ఆయన ఎంతో పెద్ద హీరో అవుతాడని తాను అప్పుడే ఊహించినట్లు తెలిపారు.
ఆ రోజుల్లో ప్రముఖ నటుడు కృష్ణంరాజు గారు చిరంజీవిని చూసి మంచి విలన్ దొరికేశాడని అంటే.. తాను మాత్రం ``ఈ అబ్బాయి ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని`` చెప్పానని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి ఈ వయసులోనూ అంత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటూ డాన్సులు, ఫైట్లు చేయడానికి ఆయన కచ్చితమైన ఆహారపు అలవాట్లే కారణమని చెబుతూ...చిరు ఉదయం పూట కేవలం అర ఇడ్లీ మాత్రమే తింటారని చమత్కారంగా వివరించారు.
ఇక రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జైలులో నిర్బంధించిన కష్టకాలంలో పవన్ కల్యాణ్ ఆయనను పరామర్శించడానికి వెళ్లిన వైనాన్ని మురళీ మోహన్ కొనియాడారు. ఆ సమయంలో వ్యతిరేక ఓట్లు చీలకుండా అందరం కలిసి కూటమిగా ఏర్పడదామని పవన్ ప్రతిపాదించారని.. అటు చంద్రబాబుతో.. ఇటు మోదీతో మాట్లాడి కూటమిని విజయవంతం చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
అంతేకాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కల్యాణ్ మొట్టమొదటిసారిగా తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు, వదిన గారికి పాదాభిషేకం చేసి తన సంస్కారాన్ని.. అన్నపై ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారని మురళీ మోహన్ ప్రశంసించారు. అన్నదమ్ములు ఇద్దరూ సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
ఇక కపిలేశ్వరంలో జీబీ చౌదరి- భాస్కరరావు సంయుక్తంగా ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ ఆసుపత్రిని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లే పనిలేకుండా స్థానికంగానే ఉత్తమమైన వైద్యం పొందవచ్చని మురళీ మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
