సీనియర్ హీరోయిన్ ఇంట్లో ఈడీ సోదాలు!
ఈడీ అధికారులు మోహన్ గుప్తా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు కీలక పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 9 July 2025 9:08 PM ISTతెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న "సీతాకోక చిలుక" నటి ముచ్చర్ల అరుణ పేరు ఇప్పుడు మరో కారణంగా వార్తల్లోకి వచ్చింది. వివాహానంతరం సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె, ఇప్పుడు ఈడీ అధికారుల తనిఖీలతో మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. చెన్నైలోని ఆమె నివాసంలో బుధవారం ఉదయం జరిగిన సోదాలు కలకలం రేపుతున్నాయి.
చెన్నైలోని కపాలీశ్వరర్ నగర్‌లో ఉన్న అరుణ నివాసంలో ఈడీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మొత్తం పదిమందికి పైగా ఉన్న అధికారుల బృందం, ఆమె ఇంటిని పూర్తిగా తనిఖీ చేశారు. ముచ్చర్ల అరుణ భర్త మోహన్ గుప్తా నిర్మాణ రంగంలో వ్యాపారాలను నిర్వహిస్తుండగా, వాటిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు భాగంగా ఈ సోదాలు జరిగినట్టు సమాచారం.
ఈడీ అధికారులు మోహన్ గుప్తా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు కీలక పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఫైనాన్స్, ల్యాండ్ డీల్, బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలను ఈడీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
ముచ్చర్ల అరుణ తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినా, తన నటనతో గుర్తింపు పొందిన హీరోయిన్. భారతిరాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోక చిలుక చిత్రంతో అరుణ సినీ కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో చంటబ్బాయ్, జస్టిస్ చౌదరి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.
వివాహానంతరం సినిమాలకు పూర్తిగా తగ్గించి, కుటుంబ జీవితాన్ని మించకుండా గడుపుతున్న అరుణ పేరు, ఇప్పుడిలా ఈడీ దర్యాప్తుతో మళ్లీ మీడియాలో చర్చనీయాంశంగా మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆమెపై ప్రత్యక్ష ఆరోపణలు లేనప్పటికీ, భర్త మోహన్ గుప్తా సంబంధిత వ్యాపారాలే ఈ తనిఖీలకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే ఈడీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
