అల్లు అర్జున్ ఫీలైన సినిమా ఇదే.. ఎంఎస్ రాజు బయటపెట్టిన అసలు కథ!
టాలీవుడ్‌లో ఒక హీరో మిస్ చేసిన సినిమా మరో హీరో కెరీర్‌ను మార్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 20 May 2026 8:00 PM ISTటాలీవుడ్‌లో ఒక హీరో మిస్ చేసిన సినిమా మరో హీరో కెరీర్‌ను మార్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ హీరో చేసి ఉంటే ఎలా ఉండేదనే చర్చను ఏళ్ల తరబడి కొనసాగిస్తాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన చర్చ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ప్రముఖ నిర్మాత M. S. రాజు చేసిన తాజా వ్యాఖ్యలు. ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా గురించి ప్రస్తావించారు.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా అంటే చరణ్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు చాలా ఇష్టమని చెప్తూ, ఆ సినిమాలో తనను హీరోగా ఎందుకు తీసుకోలేదని బన్నీ తనని అడిగినట్టు చెప్పారు. అప్పటికే బన్నీ సక్సెస్‌ఫుల్ హీరో అయినప్పటికీ తననెందుకు ఆ సినిమాకు సెలెక్ట్ చేయలేదని అల్లు అర్జున్ ఫీలయ్యారని ఎంఎస్ రాజు చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రేమకథలతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్‌కు ఆ కాలంలో వరుసగా ఎన్నో లవ్ స్టోరీలు వచ్చాయి.ఆ టైమ్ లోనే కొన్ని పెద్ద హిట్ సినిమాలు కూడా బన్నీ చేతుల నుంచి జారిపోయాయని ఇండస్ట్రీలో అప్పట్లోనే చర్చ జరిగింది. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా మాత్రం బన్నీ వద్దకు వెళ్లలేదు. ఆ సినిమా రిలీజయ్యాక బన్నీకి సినిమా నచ్చి ఆ సినిమా తాను చేస్తే బావుండేదని ఫీలైనట్టు రాజు వివరించారు.
అయితే అల్లు అర్జున్ అడిగిన దానికి ఎంఎస్ రాజు చెప్పిన సరైన సమాధానమే చెప్పారు. అల్లు అర్జున్ లో ఉన్న రఫ్ అండ్ టఫ్ బాడీ లాంగ్వేజ్ కారణంగానే ఆ పాత్రకు బన్నీని తీసుకోలేదని, కథ ప్రకారం హీరో విదేశాల్లో పెరిగిన ధనిక కుటుంబానికి చెందిన వాడై ఉండి, ప్రేమ కోసం గ్రామానికి వచ్చి, కష్టాలు పడుతూ అమ్మాయి మనసు గెలుచుకోవాలి. అయితే బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్, అతని యాటిట్యూడ్, డ్యాన్స్ ఎనర్జీ చూసి ఈ హీరో అయితే గంటలోనే ప్రేమను గెలుచుకుంటాడు అన్న ఫీలింగ్ తనకు వచ్చిందని అందుకే వేరే హీరోతో ముందుకెళ్లామని బన్నీకి చెప్పినట్టు రాజు వెల్లడించారు. దానికి బన్నీ.. ఇది కూడా నిజమేనండి అంటూ బన్నీ నవ్వుతూ స్పందించాడని ఆయన గుర్తు చేశారు.
అప్పట్లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజిక్, లవ్ స్టోరీ, ఎమోషన్స్ తో భారీ విజయాన్ని అందుకుంది. త్రిష- సిద్ధార్థ్ జంటకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలతో మరోసారి బన్నీ ఈ సినిమా చేసి ఉంటే మూవీ ఇంకా వేరే లెవెల్‌లో ఉండేదా? అనే డిబేట్ సోషల్ మీడియాలో మొదలైంది. కొందరు అభిమానులు అల్లు అర్జున్ ఎనర్జీతో సినిమా మరింత కమర్షియల్ రేంజ్‌కు వెళ్లేదని అంటుంటే, మరికొందరు మాత్రం సిద్ధార్థ్ అమాయకత్వమే ఆ పాత్రకు ప్రాణమని అభిప్రాయపడుతున్నారు.
