ఆ హీరోయిన్ వల్ల మృణాల్‌కు అవమానం
ఈ వేడుకకు ముందుగా మృణాల్ ఠాకూర్ హాజరవ్వగా అక్కడున్న మీడియా మొత్తం ఆమె చుట్టూ చేరి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది.
By: Tupaki Desk | 29 April 2025 4:00 AM ISTమరాఠి సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హిందీలోనూ సూపర్ 30, జెర్సీ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తన అందచందాలతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఈ అందాల భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయం బయటపెట్టింది.
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామంలో నూర్జహాన్ పాత్రలో తన అందం, అభినయంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మృణాల్. ప్రస్తుతం హిందీ, తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలను చేస్తున్న మృణాల్ పేరు చిత్ర పరిశ్రమలో మార్మోగుతున్న వేళ తనకు ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్ సందర్భంగా ఊహించని అవమానం జరిగిందని చెప్పింది.
ఇటీవల క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హాజరయ్యారట. ఈ వేడుకకు ముందుగా మృణాల్ ఠాకూర్ హాజరవ్వగా అక్కడున్న మీడియా మొత్తం ఆమె చుట్టూ చేరి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. ఇంతలో అక్కడికి జాన్వీ కపూర్ రాగా ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు మృణాల్‌ను వదిలేసి ఆమె దగ్గరకు పరిగెత్తారట.
ఈ ఊహించని సంఘటనతో తాను ఎంతో బాధపడ్డానని మృణాల్ ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ అవమానకరమైన ఘటనతో చాలా ఆవేదనకు లోనయ్యానని తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ వారసత్వానికి ఉన్న ప్రాధాన్యత సాధారణ నటీనటులకు ఉండదని మృణాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మృణాల్ వ్యాఖ్యలతో బాలీవుడ్‌లో నెపోటిజమ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
