Begin typing your search above and press return to search.

మృణాల్ పదేళ్ల ఎదురుచూపులకు తెర పడేనా...?

తెలుగు సినిమా 'సీతా రామం' సినిమాతో 2022లో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌.

By:  Tupaki Desk   |   15 July 2025 12:02 PM IST
మృణాల్ పదేళ్ల ఎదురుచూపులకు తెర పడేనా...?
X

తెలుగు సినిమా 'సీతా రామం' సినిమాతో 2022లో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. తెలుగులో మొదటి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చోటు సంపాధించింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసే అవకాశాలను కూడా ఈ అమ్మడు సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్న సమయంలో కొన్నింటిని తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్‌లో అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న మృణాల్‌ ఠాకూర్ బాలీవుడ్‌లో మాత్రం హిట్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. దాదాపు దశాబ్ద కాలంగా ఉత్తరాదిన సినిమాలు చేస్తున్న ఈమె అక్కడ బిగ్‌ కమర్షియల్‌ హిట్‌ను అందుకోలేక పోయింది.


2014లో హలో నందన్‌ అనే మరాఠీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మృణాల్‌ ఠాకూర్‌ లవ్‌ సోనియాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కినప్పటికీ భారీ విజయాలను మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా మృణాల్‌కి అక్కడ స్టార్‌డం దక్కలేదు. తెలుగు ప్రేక్షకుల్లో దక్కినంత గుర్తింపు, స్టార్‌డం అక్కడి ప్రేక్షకుల్లో మృణాల్‌ సొంతం చేసుకోలేక పోయింది. టాలీవుడ్‌లో హిట్ పడ్డా ఇంకా బాలీవుడ్‌లో హిట్‌ కోసం ఈ అమ్మడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ నుంచి వచ్చిన ఏ ఒక్క ఆఫర్‌ను కూడా మృణాల్‌ ఠాకూర్‌ వదులుకోకుండా వరుసగా సినిమాలను చేస్తూనే ఉంది.


ప్రస్తుతం మృణాల్‌ చేతిలో నాలుగు హిందీ సినిమాలు ఉన్నాయి. అందులో 'సన్నాఫ్‌ సర్దార్‌ 2' ఒకటి. ఆ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అజయ్ దేవగన్‌ హీరోగా నటించిన ఆ సినిమాకు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయింది. గతంలో వచ్చిన సన్నాఫ్ సర్దార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాకు రీమేక్‌గా సన్నాఫ్ సర్దార్‌ వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ రీమేక్‌కి సీక్వెల్‌ రూపొందించారు. మృణాల్‌ ఠాకూర్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు బాలీవుడ్‌లో మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి.


బాలీవుడ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి మృణాల్‌ ఠాకూర్‌ సాలిడ్‌ కమర్షియల్‌ హిట్‌ను అందుకోలేక పోయింది. అందుకే ఈ సినిమా అయినా ఆమె సక్సెస్ ఎదురుచూపులకు తెర దించుతుందేమో చూడాలి. సన్నాఫ్‌ సర్దార్‌ 2 సినిమాలో మృణాల్ ఠాకూర్ ముఖ్యమైన రబీయా అక్తర్‌ పాత్రలో కనిపించబోతుంది. ప్రమోషనల్‌ వీడియోలను చూస్తూ ఉంటే మృణాల్‌కి ముఖ్యమైన పాత్ర పడ్డట్లుగా అనిపిస్తుంది. కనుక మృణాల్ ఠాకూర్‌ ఖచ్చితంగా ఈ సినిమాతో మొదటి బాలీవుడ్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో ఈ అమ్మడి జోరు ఓ రేంజ్‌లో పెరిగినా ఆశ్చర్యం లేదని నెట్టింట ఆమె ఫ్యాన్స్‌ మాట్లాడుతున్నారు.