ప్రీమియర్ సక్సెస్.. శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' టీమ్ ఏమందంటే?
కంటెంట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం మృత్యుంజయ్ విడుదలకు సిద్ధమైంది.
By: M Prashanth | 6 March 2026 12:12 AM ISTకంటెంట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం మృత్యుంజయ్ విడుదలకు సిద్ధమైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాను దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించగా, లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మాతలు సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటించారు.
మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రాన్ని గురువారం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ప్రీమియర్ గా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిత్రబృందం తమ అనుభవాలను పంచుకుంది. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ సినిమా పట్ల తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ప్రీమియర్ షోకు వచ్చిన వారి రియాక్షన్ థియేటర్ లో చూశానని, అందరూ ఎంజాయ్ చేశారని తెలిపారు.
తమ సినిమా ప్రమోషన్ కు ప్రముఖుల మద్దతు లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి నుంచి ప్రచారం మొదలైందని, ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే నటుడు నాని సినిమా చూసి ప్రశంసించడం టీమ్ కు మరింత ఉత్సాహం ఇచ్చిందన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను మీడియా, ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, మృత్యుంజయ్ కు అదే మద్దతు దక్కాలని కోరారు.
నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ, సినిమా కోసం టీమ్ అంతా ఎంత కష్టపడ్డారో వివరించారు. పలువురు సినీ ప్రముఖులు చిత్రానికి అండగా నిలవడం తమకు ధైర్యం ఇచ్చిందన్నారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ సహా పలువురు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. సినిమాలో శ్రీ విష్ణు కొత్త కోణంలో కనిపిస్తారని, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ, నాని నుంచి వచ్చిన ప్రశంసలు తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని చెప్పారు. శ్రీ విష్ణు రిపోర్టర్ పాత్రలో కనిపిస్తారని, ఇప్పటివరకు చూడని నటనను ప్రదర్శించారని తెలిపారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా చిత్రంలో ఉంటాయని వివరించారు. హీరోయిన్ రెబా మోనికా జాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
హీరోయిన్ రెబా మోనికా జాన్ మాట్లాడుతూ, తమ సినిమాకు మీడియా నుంచి వస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కథ, పాత్రలు, టీమ్ వర్క్ అన్నీ కలిసి వచ్చిన మంచి సినిమా ఇది అని చెప్పారు. మళ్లీ ఇదే టీమ్ తో పని చేయాలని ఉందని తెలిపారు. ఇతర నటీనటులు కూడా సినిమా కథ, నిర్మాణ విలువలు, టీమ్ కృషి గురించి మాట్లాడుతూ మృత్యుంజయ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు. అయితే ప్రీమియర్ షో రెస్పాన్స్ తో ఉత్సాహంగా ఉన్న టీమ్, థియేటర్లలో కూడా ఇదే రేంజ్ లో ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
