పాన్ ఇండియాలో అన్ని రికార్డులను కొట్టే సినిమా?
భారతీయ సినీపరిశ్రమలో ఊహాతీతమైన పరిణామం చోటు చేసుకుంటోంది. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు.
By: Tupaki Desk | 18 Sep 2023 2:45 AM GMTభారతీయ సినీపరిశ్రమలో ఊహాతీతమైన పరిణామం చోటు చేసుకుంటోంది. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఒకదానిని మించి ఒకటిగా అసాధారణ రికార్డులు కొట్టే సినిమాలను మన ఫిలింమేకర్స్ నిర్మిస్తున్నారు. సవాళ్లు ఎన్ని ఎదురైనా మొక్కవోని ధీక్షతో భారీ బడ్జెట్లను కుమ్మరిస్తూ మన మేకర్స్ సాహసాలు చేస్తున్నారు. దక్షిణాది పాన్ ఇండియా చిత్రాలు బాహుబలి-బాహుబలి2- కేజీఎఫ్ - కేజీఎఫ్ 2, పుష్ప- ఆర్.ఆర్.ఆర్ చిత్రాలు నిజానికి ఫిలింమేకర్స్ లో గొప్ప స్ఫూర్తిని నింపాయి. ఈ స్ఫూర్తితో బాలీవుడ్ ఇప్పుడు ఊపందుకుంటోంది.
ముఖ్యంగా యష్ రాజ్ ఫిలింస్ ఇటీవల స్పై యూనివర్శ్ తో భారీ రికార్డులను తిరగరాయాలని కలలుగంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన పఠాన్ చిత్రంతో అనుకున్నది సాధించారు. ఈ చిత్రం 1000కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడం ఒక పెను సంచలనం. అలాగే షారూఖ్ రెడ్ చిల్లీస్ బ్యానర్ నిర్మించిన జవాన్ రూ. 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో టైగర్ 3తో మరోసారి రికార్డులు కొట్టేయాలని కలలుగంటున్నారు యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. ఇంతటితో ఆయన ఆగిపోరు. ఇంకా ఇంకా రికార్డులు కొల్లగొట్టాలని అతడు ఆశపడుతున్నాడు. తదుపరి టైగర్ vs పఠాన్ సినిమాతో సంచలనాలు సృష్టించాలని, ఇప్పటివరకూ భారతదేశ సినీపరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని ఆది భావిస్తున్నారని హిందీ మీడియాలో కథనాలొస్తున్నాయి. బాలీవుడ్ అగ్రహీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను కలుపుతూ వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ని ప్రారంభించేందుకు ప్లాన్ ని సిద్ధం చేసారు. ఈ నెల నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాజాగా తెలిసింది.
పఠాన్ లో టైగర్ సల్మాన్ ఖాన్ అతిధి పాత్రతో అదరగొట్టాడు. బాలీవుడ్‌లోని ఇద్దరు అతిపెద్ద సూపర్‌స్టార్లు చాలా కాలం తర్వాత తెరపై కలిసి కనిపించడంతో వారి అభిమానులకు ఇది చిరస్మరణీయం. ప్రియమైన `కరణ్ అర్జున్`ని మరోసారి పెద్ద తెరపై చూడాలని కోరుకునే అభిమానులకు పఠాన్ బిగ్ ట్రీట్ గా మారింది. అలాగే టైగర్ 3 అంతకుమించి ట్రీట్ గా ఉంటుందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. వీటన్నిటికీ మించి YRF చిత్రం `టైగర్ వర్సెస్ పఠాన్`కి షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్ అందింది. దీనికి సంబంధించిన ప్రీప్రిపరేషన్ వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. నిర్మాత ఆదిత్య చోప్రా స్క్రిప్ట్‌ను సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్‌లకు విడివిడిగా వివరించారని వారిద్దరూ ప్రాజెక్ట్‌కు థంబ్స్ అప్ (గ్రీన్ సిగ్నల్) ఇచ్చారని తెలుస్తోంది. టైగర్ vs పఠాన్ చిత్రం నవంబర్ 2023 నెలలో ప్రారంభమవుతుంది. పూర్తి ప్రిపరేషన్ తర్వాత ఆ ఇద్దరు అగ్రహీరోలు ఈ ప్రాజెక్ట్ కోసం మార్చి 2024లో షూటింగ్‌ను ప్రారంభిస్తారు. స్క్రిప్ట్ లాక్ అయింది. టైగర్ vs పఠాన్ పై టీమ్ చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలిసింది. ఇప్పటివరకూ భారతదేశంలో ఏ సినిమాకి పెట్టనంత బడ్జెట్ ని వెచ్చించాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. టైగర్ vs పఠాన్ ఇప్పటికే X (గతంలో ట్విట్టర్)లో ట్రెండింగ్ అవుతోంది. ఇద్దరు తారల అభిమానుల క్లబ్‌లు భారీ ఉత్సాహాన్ని వ్యక్తం చేశాయి. ఈ సినిమాతో మునుపటి రికార్డులన్నీ బ్రేక్ చేయాలనేది యష్ రాజ్ అధినేత ఆలోచన.
అయితే పఠాన్ - జవాన్- టైగర్ 3 చిత్రాల రికార్డులను సవరించేందుకు సౌత్ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో ప్రభాస్ నటిస్తున్న సలార్ - ప్రాజెక్ట్ కే చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు ఖాన్ ల రికార్డులను సైతం తిరగరాస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 సైతం చాలా రికార్డులను బ్రేక్ చేస్తుందని, పాన్ ఇండియాలో టాప్ పొజిషన్ లో నిలుస్తుందని అంచనా ఉంది. అందువల్ల యష్ రాజ్ బ్యానర్ సినిమాలకు ధీటైన పోటీ సౌత్ నుంచి ఎదురు కానుంది. కానీ అన్నిటినీ కొట్టేలా టైగర్ వర్సెస్ పఠాన్ ని నిర్మించాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి.
షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ తాజా ప్రాజెక్ట్స్..
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన కొత్త సినిమా `జవాన్` విజయాలన్నీ ఆస్వాధిస్తున్నాడు. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, సంజయ్ దత్, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు నటించిన ఈ చిత్రం దేశీకలెక్షన్లతో 400 కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన తదుపరి విడుదలైన డుంకీ కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో థియేటర్లలోకి వస్తుంది. మరోవైపు సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన టైగర్ 3 విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో టైగర్ 3 కూడా చేరుతుందని అంచనా.