Begin typing your search above and press return to search.

కాస్టింగ్ డైరెక్ట‌ర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలి!

సినిమా నిర్మాణం ఎన్నో స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. 24 శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌గ‌ల‌డం పెద్ద స‌వాల్

By:  Tupaki Desk   |   28 Feb 2024 4:08 AM GMT
కాస్టింగ్ డైరెక్ట‌ర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలి!
X

సినిమా నిర్మాణం ఎన్నో స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. 24 శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌గ‌ల‌డం పెద్ద స‌వాల్. ముఖ్యంగా ఆర్టిస్టుల‌తో కోఆర్డినేష‌న్ అనేది ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు అంత సులువేమీ కాదు. కానీ దీనిని విజ‌య‌వంతంగా చేయ‌డానికి మ‌ధ్య‌లో కోఆర్డినేష‌న్ వ్య‌వ‌స్థ స‌హ‌క‌రిస్తుంటుంది. వీళ్ల‌నే కాస్టింగ్ డైరెక్ట‌ర్ అంటారు. అయితే కాస్టింగ్ డైరెక్ట‌ర్ల‌తో ఆర్టిస్టుల‌కు పొస‌గ‌డం లేదు. త‌మ‌కు వ‌చ్చే ఆదాయానికి కాస్టింగ్ ఏజెంట్లు గండి కొడ‌తార‌నే న‌టీన‌టులు ప్ర‌తిసారీ ఆరోపిస్తుంటారు. ప‌ర్సంటేజీల పేరుతో స‌గం భ‌త్యం కూడా ఇవ్వ‌కుండా వేధిస్తార‌ని, చాలా సార్లు ఎగ‌వేసే సంద‌ర్భాలుంటాయ‌ని ఆర్టిస్టులు ఆరోపించిన సంద‌ర్భాలున్నాయి. ద‌శాబ్ధాలుగా కాస్టింగ్ ఏజెంట్ల వేధింపుల ప్ర‌హ‌స‌నంపై ఆర్టిస్టుల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది.

మ‌రోసారి ఇది ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) త‌ర్వాత అతి పెద్ద సంఘంగా ఏర్ప‌డిన టిఎంటిఏయులో ఇది ముస‌లంగా మారింది. కాస్టింగ్ డైరెక్టర్ వ్యవస్థను తీసేయాలని ఆర్టిస్టుల వాట్సాప్ గ్రూప్ లో తీవ్ర చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు ఈ వ్య‌వ‌స్థ‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ ఫిలిం ఛాంబర్ వ‌ద్ద‌ ధర్నా చేసేందుకు ఆర్టిస్టులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది.

ఈ క్యాస్టింగ్ డైరెక్టర్ వ్య‌వ‌స్థ‌ వల్లే మనం వెనకబడిపోయాం. చాంబ‌ర్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగితేనే ప్రతి ఒక్క హీరో మ‌న గోడు వింటాడు. గవర్నమెంట్ కూడా వింటుంది. మన మాట ఎవ‌రికీ ఖాత‌రు లేకుండా పోయింది. దానిని మార్చేందుకే ఈ పోరాటం! అంటూ గ్రూప్ స‌భ్యుల్లో చ‌ర్చ న‌డిచింది. టీఎంటిఏయు స‌భ్యుల్లో ఇలాంటి చ‌ర్చ సాగ‌డం ఇదే మొద‌టి సారి కాదు. దాదాపు 1400 మంది ఆర్టిస్టుల‌తో అతి పెద్ద గ్రూప్ గా ఏర్ప‌డిన త‌ర్వాత ఆర్టిస్టుల బ‌లం పెరిగింది. దీంతో ప‌దే ప‌దే కోఆర్డినేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై చ‌ర్చ విస్త్ర‌త‌మైంది.

ఆర్టిస్టుల‌ డిమాండ్ ఏంటంటే..?

1) కాస్టింగ్ డైరెక్టర్ వ్యవస్థను వెంట‌నే తీసేయాలి.

2) షూటింగ్ చేసిన పది రోజులకి 15 రోజులకి పేమెంట్ ఇచ్చేయాలి లేదా నెల‌లోపే పేమెంట్ ఇవ్వాలి.

3) సినిమా ఆఫీసులోనే ఆడిషన్ పెట్టాలి. ఏ దళారి వ్యవస్థతో సంబంధం లేకుండా అడిషన్ జరిగేలా చూడాలి.

4) ఏ రోజైతే షూటింగ్ జరుగుతుందో ఆరోజు ప్రతి ఆర్టిస్ట్‌ని ఆఫీస్‌కి రమ్మ‌నాలి. అక్కడి నుంచి వెహికల్‌లో లొకేష‌న్ కి తీసుకెళ్లాలి. కన్వినెన్స్ కంపల్సరిగా రూ.300 ఇవ్వాలి

5) ఆర్టిస్టులకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి? మన దగ్గర అంత డబ్బు ఉండదు. అయితే ఈ ఆరోగ్య శ్రీ మనకు వర్తించేలాగా చేయాలి. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సినిమా వర్కర్స్ కి ఆరోగ్య శ్రీ వర్తించేలా చేయాలని డిమాండ్ చేద్దాం.

పై డిమాండ్లు నెరవేరితే మన ఆర్టిస్ట్ బాగుపడ్డట్టే...