ఆ విషయంలో దిల్ రాజు ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
రీసెంట్ గా హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు సినిమాల పైరసీ కేసులో దొరకడంతో ఇండస్ట్రీ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.
By: Tupaki Desk | 4 July 2025 1:04 PM ISTరీసెంట్ గా హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు సినిమాల పైరసీ కేసులో దొరకడంతో ఇండస్ట్రీ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఫోన్ లో షూట్ చేసిన కొత్త సినిమాలను కొన్ని వెబ్‌సైట్స్ కు అమ్మే టెక్నీషియన్ ను ప్రూఫ్ లతో సహా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతన్నుంచి అందరూ షాకయ్యే నిజాలు వెల్లడవుతున్నాయి. సినిమా రిలీజ్ రోజే థియేటర్‌కు వెళ్లి సీక్రెట్ గా సినిమాను షూట్ చేసి, పూర్తి సినిమాను కొన్ని యాప్స్ ద్వారా భారీ రేటుకు అమ్మడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇలాంటి వాళ్ల వలనే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాన్ ఇండియా సినిమాలకు నష్టం వాటిల్లుతుంది. గత కొన్ని నెలలుగా ఈ పైరసీ భూతం మరీ ఎక్కువైపోయింది. గేమ్ ఛేంజర్, తండేల్ సినిమా టైమ్ లో ఈ పైరసీ ఏకంగా హెచ్‌డీ రూపంలో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు ఈ పైరసీని ఎలా అరికట్టాలనే విషయంలో ఎంత ఆలోచించినా దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు.
అయితే ఇప్పుడు రీసెంట్ గా అరెస్ట్ అయిన వ్యక్తి ద్వారా ఓ చిన్న లింకైతే దొరికింది. దాన్ని పట్టుకుని ఆరా తీస్తే ఈ పైరసీ అనేది చాలా పెద్ద మాఫియా అని తెలుస్తోంది. అసలు ఎక్కడినుంచి ఎవరు దీన్ని మొదలుపెడుతున్నారో కూడా తెలియడం లేదు. కాబట్టి కేవలం సినీ రంగంలోని నిర్మాతలు మాత్రమే దీన్ని నివారించడం చాలా కష్టం. దీనికి ప్రభుత్వాల హెల్ప్ కూడా కావాలి.
అందులో భాగంగానే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో ఓ స్పెషల్ కమిటీని వేయబోతున్నట్టు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి పైరసీని నివారించడమే టార్గెట్ గా చర్యలు చేపట్టబోతున్నారని సమాచారం. ఈ విషయంలో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చర్యలు తీసుకుంటే తప్ప వీటిని నివారించడం కష్టం. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాషలకు సంబంధించిన ఇండస్ట్రీలు ఈ విషయంలో కలిసికట్టుగా పని చేస్తే పైరసీ విషయంలో మార్పు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ విషయంలో దిల్ రాజు వేస్తున్న అడుగులు ఎటు పడతాయో చూడాలి.
