Begin typing your search above and press return to search.

రివ్యూ : మంత్ ఆఫ్ మధు

By:  Tupaki Desk   |   6 Oct 2023 5:22 PM GMT
రివ్యూ : మంత్ ఆఫ్ మధు
X

నటీనటులు : నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర తదితరులు.

సంగీతం: అచ్చు రాజమణి

సినిమాటోగ్రఫీ: రాజీవి ధరావత్

నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల

రచయిత - దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి

కలర్స్ స్వాతి గా పేరు తెచ్చుకున్న స్వాతి అష్టా చెమ్మా తో సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటింది. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. కెరీర్ లో అవకాశాలు లేని టైం లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన స్వాతి రీసెంట్ గా సత్య అనే ఒక స్పెషల్ వీడియో సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్య వీడియో సాంగ్ లో సాయి ధరం తేజ్ తో కలిసి నటించడం వల్ల ఆమెకు కొంత క్రేజ్ ఏర్పడింది. ఇక చాలా గ్యాప్ తర్వాత స్వాతి మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ చంద్ర మేల్ లీడ్ గా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ:

మధుసూదన్ (నవీన్ చంద్ర), లేఖ (స్వాతి) ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మధులోని మొండితనాన్ని కొన్నాళ్ల పాటు సహించిన లేఖ కొంత కాలం తర్వాత అతని నుంచి విడిపోవాలని కోర్టుని ఆశ్రయిస్తుంది. ఈలోగా ఎన్నారై మధుమతి (శ్రేయా నవిలే) తన తల్లితో కలిసి ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడం కోసం ఇండియాకు వస్తుంది. అమెరికా కల్చర్ అలవాటు పడిన మధు ప్రవర్తన అక్కడ వారిని ఇబ్బంది పెడుతుంది. మధుసూదన్, మధుమతి కథలు ఎలా సాగాయి..? మధుసూదన్ నుంచి లేక విడాకులు తీసుకుందా..? మధుసూదన్ ఆ తర్వాత ఏం చేశాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం-విశ్లేషణ :

వెండితెర మీద ఎన్ని ప్రేమకథలు వచ్చినా సరే ఎప్పటికప్పుడు కొత్త కథలు రచిస్తూనే ఉంటారు. లవ్ స్టోరీస్ ఎప్పుడు పాతవి కావు. దర్శక నిర్మాతలు కూడా యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో ముందు వాటికే ప్రాముఖ్యత ఇస్తారు. లవ్ స్టోరీ జానర్ లో ప్రేమ కథలను రిలేట్ గా ఉంటూ ఫ్రెష్ గా అనిపించడం ముఖ్యం. దర్శకుడి ప్రతిభ ప్రేమను ప్రదర్శించే యాంగిల్ ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమ కథలు కొన్నైతే పెళ్లి తర్వాత ప్రేమను చూపించే ప్రేమ కథలు కొన్ని. అలాంటి కోవకు చెందిన సినిమానే మంత్ ఆఫ్ మధు.

లవ్ స్టోరీలో వర్క్ అవుట్ అవాల్సింది లవ్ అండ్ ఎమోషన్.. ఇది బాగా కుదిరితే మాత్రం ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారు. మంత్ ఆఫ్ మధు లో కూడా అలా ప్రేక్షకులను ఆకర్షించే పాత్రలు కనిపిస్తాయి. అయితే పాత్రలను కొంతమేరకు బాగా నడిపించినా ఆ తర్వాత కొంత నెమ్మదిగా అనిపిస్తుంది. వేరు వేరు ట్రాక్ లలో మంత్ ఆఫ్ మధు సినిమా నడుస్తుంది. అయితే ఈ మార్పులు ఒక్కోసారి కొంత గందరగోళం ఏర్పడినట్టు అనిపిస్తుంది.

రెండు ట్రాక్ లు వాటి పాత్రలు బలంగా ఉన్నా కథనంలో వేగం కనిపించదు. అయితే పాత్రల స్వభావాల వల్ల ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించడానికి కాస్త వేగం ఉండాల్సిన అవసరం ఉంది. అది లోపించడం వల్ల సినిమా మీద ప్రేక్షకుడు ఆసక్తిని కోల్పోతాడు. వైవా హర్ష సన్నివేశాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి.

డైరెక్టర్ శ్రీకాంత్ డీల్ చేయాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా పాత్రలకు కలిసి వచ్చేలా కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. సినిమాలో కొన్ని పాత్రల ద్వారా జీవిత తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఆ విషయంలో దర్శకుడికి మంచి మార్కులు పడ్డాయి.

మంత్ ఆఫ్ మధు లో డైరెక్టర్ చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్స్ ను రాసుకున్నాడు. అయితే వాటిని ప్రేక్షకులకు దగ్గర చేయడంలో విఫలమయ్యాడు. అందుకే సినిమా కొంత అసంతృప్తి పరుస్తుంది. కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి.. అయితే పూర్తిగా మాత్రం సంతృప్తి పరచలేదు. ఓ పరిణతి చెందిన ప్రేమ కథ మంచి నటనతో కూడిన కథ చూడాలనుకుంటే మంత్ ఆఫ్ మధు ఓ లుక్కేయొచ్చు. నెమ్మదిగా సాగే కథనం వల్ల సినిమా ఎక్కువమందిని ఇంప్రెస్ చేయలేదు.

నటీనటులు :

తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే న్యాయం చేసే యువ హీరోల్లో నవీన్ చంద్ర ఒకరు. తన దాకా వచ్చిన మంచి కథలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఈ సినిమాలో కూడా తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నవీన్ చంద్ర నటన ఇంప్రెస్ చేస్తుంది. కలర్స్ స్వాతి కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. స్క్రీన్ పై డీసెంట్ గా కనిపించడమే కాకుండా సెంటిమెంట్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యేలా చేసింది. తొలి సినిమా అయినా కూడా శ్రేయ నటన ఆకట్టుకుంది. మంజుల ఘట్టమనేని తల్లి పాత్రలో మెప్పించింది. వైవా హర్ష టైమింగ్ నవ్వులు పంచింది. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం :

మంత్ ఆఫ్ మధు టెక్నికల్ గా బాగుంది. రాజీవ్ విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. కెమెరా పనితనంతో సినిమా మూడ్ ని ఆడియన్స్ కు మ్యాచ్ చేయగలిగాడు. అచ్చు రాజమణి సంగీతం ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది. పాటలు అంత గొప్పగా లేకపోయినా సందర్భోచితంగా ఉన్నాయి కాబట్టి ఏదో అలా వెళ్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు సపోర్ట్ చేసింది. ఎడిటింగ్ ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా కథకు తగినట్టుగా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ మంచి కథ దానికి తగిన పాత్రలు రాసుకున్నాడు కానీ ఆ కథకు తగిన స్క్రీన్ ప్లే రాయలేకపోయాడు. సినిమాకు రన్ టైం కూడా మినస్ అయ్యింది.

చివరిగా :

మంత్ ఆఫ్ మధు.. మిస్సింగ్ గోల్..!

రేటింగ్ : 2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater