Begin typing your search above and press return to search.

2024 లో 1000 కోట్లు వాళ్ల‌కే సొంతం!

ఐదు నెల‌ల్లోనే మాలీవుడ్ సినిమాలు 1000 కోట్ల వ‌సూళ్ల బిజినెస్ తో బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్ వ‌న్ గా నిల‌బ‌డింది.

By:  Tupaki Desk   |   18 May 2024 3:30 PM GMT
2024 లో 1000 కోట్లు వాళ్ల‌కే సొంతం!
X

2024 ప్ర‌ధ‌మార్ధం ఏ ప‌రిశ్ర‌మ‌కి సోంతం? ఏ ఇండ‌స్ట్రీ రికార్డు సృష్టించింది? అంటే క‌చ్చితంగా మాలీవుడ్ కే మొద‌టి స్థానం ఇవ్వాలి. ఐదు నెల‌ల్లోనే మాలీవుడ్ సినిమాలు 1000 కోట్ల వ‌సూళ్ల బిజినెస్ తో బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్ వ‌న్ గా నిల‌బ‌డింది. పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టించిన 'ఆడు జీవితం' 175 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అటుపై రిలీజ్ అయిన 'మంజ‌మ్మ‌ల్ బోయ్స్' ఏకంగా 250 కోట్ల వ‌సూళ్ల‌నే కొల్ల‌గొట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లు ఎంతో కీల‌కంగా ఉన్నాయి.

అలాగే మ‌రో మాలీవుడ్ సినిమా 'ప్రేమ‌లు' కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆ సినిమా 140 కోట్ల వ‌ర‌కూ సాధించింది. తెలుగు ఆడియ‌న్స్ కి ఈ సినిమా బాగా క‌నెక్ట్ అయింది. ఇక మమ్ముట్టి న‌టించిన 'బ్ర‌హ్మ‌యుగం' బాగానే ఆడింది. ఆ సినిమా 75 కోట్ల‌ను సాధించింది. అలాగే ప‌హాద్ పాజిల్ హీరోగా న‌టించిన 'ఆవేశం' ఏకంగా 150 కోట్ల వ‌సూళ్ల‌తో అతడి కెరీర్ లోనే తొలి భారీ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. 'పుష్ప' ఇమేజ్ తో ఇక్క‌డ ఆ సినిమా రాణించింది.

మరో మాలీవుడ్ స్టార్ టోవినో థామ‌స్ న‌టించిన 'అన్వేషిప్ప‌న్ కొండెతుమ్' కూడా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా 50 కోట్లు వ‌ర‌కూ రాబ‌ట్టింది. మొత్తంగా ఈ లెక్క చూస్తే ఐదు నెలల్లోనే మాలీవుడ్ సినిమాల‌న్నీ క‌లిపి 1000 కోట్ల వ‌సూళ్ల బిజినెస్ జ‌రిగింది. ఇంత‌ర‌కూ ఏ ప‌రిశ్ర‌మ‌లోనూ ఐదు నెలల్లో ఈ రేంజ్ లో వ‌సూళ్లు రాలేదు. అందులోనూ వాటిలో కొన్ని మాత్ర‌మే భారీ బ‌డ్జెట్ చిత్రాలు. చాలా సినిమాలు క‌థా బ‌లంతోనే విజ‌యం సాధించాయి.

ఇక టాలీవుడ్ నుంచి చూసుకుంటే 'టిల్లుస్క్వేర్'.. 'హ‌నుమాన్'..'గుంటూరు కారం' చిత్రాల వ‌సూళ్లు అన్నీ క‌లిపితే 600 కోట్ల ఫిగ‌ర్ క‌నిపిస్తుంది. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న టాలీవుడ్ సినిమాల‌కు ఈ రేంజ్ వ‌సూళ్లు అంటే చాలా త‌క్కువే. అలాగే కోలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి చూస్తే 400 కోట్ల మార్క్ కూడా ఫిగ‌ర్ కూడా ఈ ఐదు నెల‌ల్లో క్రాస్ చేయ‌లేదు. బాలీవుడ్ లో మాత్రం కొన్ని సినిమాలు మంచి ఫ‌లితాలు సాధించ‌డంతో అక్క‌డ నుంచి 950 కోట్ల వ‌ర‌కూ క‌నిపిస్తున్నాయి. ఇక క‌న్న‌డ నుంచి కేవ‌లం 300 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగింది. మ‌రి ద్వితియార్ధం ఏ ప‌రిశ్ర‌మ‌ సొంత‌మ‌వుతుందో చూడాలి.