మల్లూవుడ్‌లా మనమెందుకు చేయట్లేదు?
మల్లూవుడ్..నో హీరో, నో హీరోయిన్ కంటెంట్ మాత్రమే కింగ్ ఇక్కడ. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కంటెంట్ ఉన్న సినిమాతో ఇక్కడ బ్లాక్ బస్టర్లని సాధిస్తున్నారు.
By: Tupaki Desk | 16 May 2025 8:15 AM ISTమల్లూవుడ్..నో హీరో, నో హీరోయిన్ కంటెంట్ మాత్రమే కింగ్ ఇక్కడ. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కంటెంట్ ఉన్న సినిమాతో ఇక్కడ బ్లాక్ బస్టర్లని సాధిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, లవ్‌స్టోరీస్..ఇలా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రతీ ఏడాది చిన్న సినిమాలే అక్కడ భారీ విజయాల్ని సాధిస్తూ వంద కోట్లని సైతం అవలీలగా రాబట్టేస్తున్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన `మంజిమ్మల్ బాయ్స్` గత ఏడాది విడుదలై మలయాళ, తెలుగు, తమిళ భాషల్లోనూ సంచలనం సృష్టించింది.
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు నటించిన ఈ మూవీని రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని విధంగా రూ.200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి విస్మయపరిచింది. ప్రయోగాత్మకంగా ఫహద్ ఫాజిల్ చేసిన `ఆవేశం`, అదే ఏడాది ఫహద్ ఫాజిల్ తన ఫ్రెండ్స్‌తో కలిసి నిర్మించిన `ప్రేమలు` మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన `ప్రేమలు` ఏకంగా రూ.100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఆశ్చర్యపరిచింది.
ఇలాగే మరికొన్ని చిన్న చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక 2025లోనూ చిన్న సినిమాలదే హవాగా సాగింది. `అళప్పుళ జింఖానా`, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, రేఖాచిత్రం, `మరణమాస్`, అలాగే తవినో థామస్ ఐడెంటిటీ, ప్రవీన్‌కోడు షాప్పు, పొన్మన్, బ్రోమాన్స్ వంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. వీటి తరహాలోనే ఇదే ఏడాది మరో చిన్న సినిమా రాబోతోంది అదే `లవ్‌లీ`. `ప్రేమలు` మూవీలో సపోర్టింగ్ రోల్‌లో నటించిన మాథ్యూ థామస్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. ఈగ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఇలా కంటెంట్ హీరోగా భావించి చిన్న సినిమాలతో మల్లూవూడ్ వరుస విజయాల్ని దక్కించుకుంటోంది. కానీ మనవాళ్లు మాత్రం స్టార్ల వెంటపడుతూ చిన్న సినిమాలని కిల్ చేస్తున్నారు. నాని, రానా లాంటి హీరోలు మాత్రమే చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. కంటెంట్ ప్రధానమైన సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. నాని సమర్పణలో విడుదలైన చిన్న చిత్రం `కోర్ట్`. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు మించి రాబట్టి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో అయినా మన వాళ్లు చిన్న సినిమాలని, కంటెంట్ ప్రధానంగా సాగే చిత్రాలని ప్రోత్సహిస్తే మరో బలగం, `కోర్ట్`, `35 చిన్నకథకాదు` వంటి అర్థవంతమైన ప్రాఫిటబుల్ మూవీస్ వస్తాయి. వాటి వల్ల థియేటర్లకు ఫీడింగ్ పెరుగుతుంది.
