మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షమెప్పుడో?
హీరోల వారసుల అరంగేట్రం కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 6 May 2025 12:30 PMహీరోల వారసుల అరంగేట్రం కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ వారి నిరీక్షణకు మాత్రం తెర పడటం లేదు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అయితే అభిమానులు వేచి చూసి చూసి విసుగెత్తిపోతున్నారు. తన ఎంట్రీ ఈ ఏడాది ఉంటుంది అంటే ఈ ఏడాది ఉంటుంది అని ఎప్పటి కప్పుడు బాలకృష్ణ చెబుతూ వస్తున్నారు కానీ అనుకున్న విధంగా మోక్షజ్ఞ మాత్రం తెరంగేట్రం చేయడం లేదు. దర్శకులు మారుతున్నారు. ప్రాజెక్ట్‌లు మారుతున్నాయే కానీ బాబు అరంగేట్రంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో `ఆదిత్య 369`కు సీక్వెల్‌గా రానున్న `ఆదిత్య 999`తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. బాలయ్య కూడా అధికారికంగా వెల్లడించారు కూడా. కానీ అది జరగలేదు. అసలు ప్రాజెక్టే ముందుకు రాలేదు. ఆ తరువాత క్రిష్ డైరెక్షన్‌లో మోక్షజ్ఞని పరిచయం చేయబోతున్నారని వార్తలు షికారు చేశాయి. బాలయ్య కూడా నిజమేనని మీడియాతో చెప్పడం తెలిసిందే. అయితే అది కూడా జరగలేదు. గత కొన్ని రోజుల పాటు ప్రశాంత్ వర్మ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా అరంగేట్రం చేస్తాడని వార్తలు షికారు చేశాయి.
అది కూడా కష్టమని తేలిపోయింది. తాజాగా మోక్షజ్ఞ అరంగేట్రంపై ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గత కొంత కాలంగా తనయుడి ఎంట్రీపై చర్చలు జరిపిన బాలకృష్ణ ఆ బాధ్యల్ని ఫైనల్‌గా దర్శకుడు క్రిష్‌కు అప్పగించాడని వార్తలు వినిపిస్తున్నాయి. తనే తనయుడిని పరిచయం చేయాలని `ఆదిత్య 999`ను ప్లాన్ చేసినా అది ఇప్పట్లో కుదరదని తెలిసి బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ బాధ్యతల్ని దర్శకుడు క్రిష్‌కు అప్పగించాడని చెబుతున్నారు.
మరి ఈ వార్తయినా నిజమవుతుందా? ఈసారైనా బాలయ్య వారసుడి ఎంట్రీ ఇస్తాడా? అనే చర్చ మొదలైంది. ప్రతీ ఏడాది నాన్నా పులి కథలా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వస్తుండటంతో ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్ క్రేజీ హీరోయిన్ అనుష్కతో పాన్ ఇండియా మూవీ `ఘాటీ`ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.