సందీప్ రెడ్డి వంగాకు థ్యాంక్స్ చెప్పిన బాలీవుడ్ డైరెక్టర్
ఆషికి2, ఏక్ విలన్, ఆవరాపన్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కృతజ్ఞతలు తెలిపారు.
By: Tupaki Desk | 25 July 2025 5:00 PM ISTఆషికి2, ఏక్ విలన్, ఆవరాపన్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్‌ను, టాలీవుడ్ డైరెక్టర్లను చిన్న చూపు చూసే బాలీవుడ్ కు చెందిన ఓ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ కు థ్యాంక్స్ చెప్పడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మోహిత్ సూరి దర్శకత్వంలో జులై 18న రిలీజైన సినిమా సైయారా. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తో పాటూ రికార్డులు సృష్టిస్తోంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి ఓ మంచి సినిమా చూస్తున్నామని సైయారా చూసిన వాళ్లంతా ఆ సినిమాను అభినందిస్తున్నారు. అయితే సైయారా చిన్న సినిమాగా వస్తున్నా, ఈ సినిమా కచ్ఛితంగా బావుంటుందని ముందు నుంచి చెప్పిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగా.
సైయారా ట్రైలర్ రిలీజయ్యాక దాన్ని చూసి ఇంప్రెస్ అయిన సందీప్, ట్రైలర్ ను షేర్ చేస్తూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రిలీజ్ డే ఫస్ట్ షో చూస్తానని మాటివ్వడంతో పాటూ, ఈ సినిమాను మోహిత్ సూరి చేసిన మ్యాజిక్ గా వంగా చెప్పుకొచ్చారు. సందీప్ చెప్పినట్టే సైయారా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద అందరి అంచనాలను మించి దాటిపోతుంది. కేవలం వారం రోజుల్లోనే రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ మోహిత్ సూరి సందీప్ రెడ్డి వంగాకు థ్యాంక్స్ చెప్పారు.
సైయారా సినిమా హిట్ అవుతుందని మొదట నమ్మిన వ్యక్తి సందీప్ అని, ఈ సినిమాకు బహిరంగంగా ముందు సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయనేనని, సైయారా మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు తానెవరో ఆయనకు తెలియకపోయినా తనపై పోస్ట్ పెట్టి సపోర్ట్ చేశారని, సందీప్ ను డైరెక్టర్ గా తానెంతో అభిమానిస్తానని, ఆయన సినిమాలు తీసే విధానమంటే తనకెంతో ఇష్టమని, ఆయన్ని ఇన్సిపిరేషన్ గా తీసుకుంటానని, ఆయన ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్తారని, దాన్ని తాను గౌరవిస్తానని, మీ లాంటి వారి అడుగుజాడల్లో నడవడం ఎంతో గర్వకారణమని చెప్తూ, ఎప్పటికీ మీకు అభిమానినే అని సందీప్ ను ఉద్దేశిస్తూ మోహిత్ సూరి పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
