Begin typing your search above and press return to search.

ఎల్‌ 2 : హిందుత్వ వివాదం కాకుండా మరోటి..!

రాజకీయ వివాదం సమసి పోతే మరో వైపు తమిళనాట ఈ సినిమాలోని సన్నివేశాలపై, హీరో, దర్శక నిర్మాతలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 April 2025 6:59 PM IST
ఎల్‌ 2 : హిందుత్వ వివాదం కాకుండా మరోటి..!
X

మోహన్‌లాల్‌ నటించిన 'ఎల్‌ 2 : ఎంపురాన్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. మొదటి రెండు రోజుల్లోనే సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఒక వైపు సినిమా వసూళ్లతో దూసుకు పోతూ ఉంటే మరో వైపు సినిమా చుట్టూ హిందుత్వ వివాదం రాజుకున్న విషయం తెల్సిందే. విలన్‌ను హిందూ ఉగ్రవాదిగా చూపించడంతో పాటు హిందు మతంను కించపరిచే విధంగా, హిందువులను కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆర్‌ఎస్‌ఎస్ సహా పలు మత పరమైన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఎల్‌ 2 చుట్టూ అలుముకున్న రాజకీయ వివాదం నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు సినిమాను తీసుకు వెళ్లారు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్‌ చేయడంతో పాటు, కొన్ని డైలాగ్స్‌ను మార్చడం, విలన్‌ పేరు మార్చడంతో పాటు చాలా మార్పులు చేశారు. తద్వారా రాజకీయ వివాదం సమసిపోయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా చిత్ర యూనిట్‌ సభ్యులు తాము ఎవరిని ఉద్దేశించి ఆ పాత్రను పెట్టలేదని, అంతే కాకుండా ఆ సన్నివేశాల్లో రాజకీయాల ప్రస్థావన లేదు అంటూ వివరణ ఇచ్చారు. సినిమా విడుదల అయ్యి వారం అవుతున్న నేపథ్యంలో హిందుత్వ వివాదం దాదాపుగా సమసి పోయినట్లే అంటున్నారు.

రాజకీయ వివాదం సమసి పోతే మరో వైపు తమిళనాట ఈ సినిమాలోని సన్నివేశాలపై, హీరో, దర్శక నిర్మాతలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రయోజనాల నిమిత్తం చాలా ఏళ్ల క్రితం కేరళలో ఒక డ్యామ్‌ను నిర్మించారు. ఆ డ్యామ్‌ కారణంగా కేరళలోని ఒక జిల్లాకు చెందిన ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఆ డ్యామ్‌ను తొలగించాలని కొందరు, ఆ డ్యామ్‌ ఎత్తు తగ్గించాలని కొందరు ఆందోళన చేస్తున్నారు. ఆ డ్యామ్‌ తొలగిస్తే తమిళనాడులోని మూడు నాలుగు జిల్లాలకు తీవ్రమైన నీటి ఎద్దడి వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ను కాపాడుకుంటూ వస్తుంది.

ఈ సినిమాలో కేరళలో ఉన్న తమిళనాడు ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. దాంతో తమిళనాట మోహన్‌ లాల్‌కి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. తమిళ హీరోలతో సమానంగా తమిళనాట మోహన్‌లాల్‌ను అభిమానిస్తూ ఉంటే ఆయన సినిమాలో మాకు వ్యతిరేకంగా ఇలాంటి సీన్స్ పెట్టడం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎల్‌ 2 సినిమాను తమిళనాట ఆడనివ్వం అంటూ రైతు సంఘాల నాయకులు, పలువురు ప్రజా సంఘాల వారు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ నెటిజన్స్‌ ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ డ్యామ్‌ వివాద సన్నివేశాలు సినిమాలో అవసరమా అంటూ కొందరు పృథ్వీరాజ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు స్పందించలేదు. మరి వారి స్పందన ఏంటి అనేది చూడాలి.