నా జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి ఆయనే -మోహన్ లాల్!
మలయాళ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మోహన్ లాల్ గత కొన్ని సంవత్సరాలుగా వరుస విజయాలు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు
By: Tupaki Desk | 5 Oct 2025 7:00 PM ISTమలయాళ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మోహన్ లాల్ గత కొన్ని సంవత్సరాలుగా వరుస విజయాలు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అరుదైన రికార్డులు సృష్టిస్తూ.. ఊహించని గౌరవాలను సొంతం చేసుకుంటూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అవార్డు అందుకున్నప్పుడు తనకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయి? తన జీవితం ఇలా మలుపు తిరగడానికి అసలు కారణం ఎవరు? ఇలా పలు విషయాలను పంచుకున్నారు.
ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయి - మోహన్ లాల్
మలయాళం సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ అటు మలయాళం , తమిళ్, తెలుగు చిత్రాలలో కూడా నటిస్తూ పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడంతో కేరళ ప్రభుత్వం ఆయనను ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు , అధికారులు మోహన్ లాల్ ను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. "నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నప్పుడు.. నాకు ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయి. గతంలో ఈ అవార్డుకి ఎంపికైన వారు, ఇండియన్ సినిమాకి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలు అన్నీ కూడా గుర్తుకొచ్చాయి". అంటూ తెలిపారు మోహన్ లాల్..
సినిమా గురించి ఏమీ తెలియదు - మోహన్ లాల్
అలాగే ఆయన మాట్లాడుతూ.." గత 48 సంవత్సరాల క్రితం నాకు సినిమా గురించి ఏమీ తెలియదు. నేను, నా కొంతమంది స్నేహితులు కలిసి ఒక చిన్న సినిమా తీయాలనుకుంటే.. నా ఫోటోలు దర్శకులు ఫాజిల్ దృష్టికి వెళ్లాయి. అలా నాకు 'మంజిల్ విరింజ పూవు' సినిమాలో అవకాశం వచ్చి.. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. అయితే నన్ను సినిమా నటుడిగా మార్చి నాకు జీవితాన్ని ప్రసాదించింది మాత్రం దర్శకులు ఫాజిల్ అంటూ చెప్పుకొచ్చారు మోహన్ లాల్. మొత్తానికైతే ఆయన వల్లే ఇప్పుడు తాను ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోగలిగాను అని కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మోహన్ లాల్ అందుకున్న అవార్డులు..
మోహన్ లాల్ గా సుపరిచితుడైన మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ 1960 మే 21న పట్టణమిట్ట కేరళలో జన్మించారు. తన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. 2001లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. నాలుగుసార్లు నేషనల్ అవార్డులు కూడా అందుకున్నారు. 2025 నాటికి మొత్తం 6 నేషనల్ అవార్డులు అందుకున్న ఈయన.. స్పెషల్ జ్యూరీ అవార్డుల విభాగంలో 4 విభాగాలలో అవార్డును దక్కించుకున్నారు. కేరళ రాష్ట్ర అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, పద్మ భూషణ్ అవార్డు కూడా ఆయనకు లభించింది.. ఇలా ఎన్నో చిత్రాలతో అంతకుమించి అవార్డులు అందుకొని అందరినీ తన నటనతో ఆశ్చర్యపరిచారు మోహన్ లాల్.
