Begin typing your search above and press return to search.

మోహన్ లాల్.. 'కామన్ మ్యాన్' బొనాంజా

కానీ తొలి రోజు అదిరిపోయే టాక్ వచ్చింది. లాలెట్టన్‌ను ఇలాంటి కామన్ మ్యాన్ పాత్రల్లో చూడడం భలేగా ఉంటుందని.

By:  Tupaki Desk   |   27 April 2025 10:00 PM IST
మోహన్ లాల్.. కామన్ మ్యాన్ బొనాంజా
X

మలయాళంలో దశాబ్దాలుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు మోహన్ లాల్. మమ్ముట్టి నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ మోహన్ లాల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వేరు. ఆయన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. గత నెలలో వచ్చిన 'ఎల్-2: ఎంపురాన్' డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా ఇండస్ట్రీ హిట్ అయింది.

'లూసిఫర్'కు సీక్వెల్ కావడం, ప్రి రిలీజ్ హైప్ వల్ల దీనికి భారీ వసూళ్లు వచ్చాయి కానీ.. ఈ చిత్రం మోహన్ లాల్ అభిమానులను సంతృప్తిపరచలేకపోయింది. ఇందులో లాలెట్టన్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. కేవలం ఎలివేషన్లతో సినిమాను నడిపించేశారు. ఐతే మోహన్ లాల్ ఇలాంటి లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లలో కంటే కామన్ మ్యాన్ క్యారెక్టర్లలోనే అదరగొడతాడు. ఫ్యాన్స్ అయినా, సామాన్య ప్రేక్షకులైనా ఆయన్ని అలాంటి పాత్రల్లో చూసేందుకే ఎక్కువ ఇష్టపడతారు.

దృశ్యం, దృశ్యం-2, బ్రో డాడీ.. ఇలాంటి చిత్రాల్లో మోహన్ లాల్ సగటు మధ్య తరగతి వ్యక్తిలాగే కనిపిస్తాడు. కానీ పెర్ఫామెన్స్ పీక్స్‌లో ఉంటుంది. విపరీతమైన హీరోయిజం, ఎలివేషన్లు లేకపోయినా.. క్యారెక్టర్లో బలం ఉంటే చాలు లాల్ దాన్ని వేరే లెవెల్‌‌కు తీసుకెళ్తాడు. ఇప్పుడు 'తుడరుమ్' సినిమాలోనూ అదే చేశారు. ఇందులోనూ ఆయన 'దృశ్యం' తరహాలో కామన్ మ్యాన్ పాత్రనే చేశారు. మామూలుగా మొదలై.. చివరికి వచ్చేసరికి బలమైన ముద్ర వేస్తుంది ఆ పాత్ర.

'ఎంపురాన్'లో భారీ ఎలివేషన్లు ఇచ్చినా రాని ఇంపాక్ట్‌ను 'తుడరుమ్'లో మామూలు పాత్ర ఇచ్చింది. ఈ చిత్రాన్ని మరో 'దృశ్యం'గా అభివర్ణిస్తున్నారు ప్రేక్షకులు. 'ఎంపురాన్'తో పోలిస్తే రిలీజ్ ముంగిట మినిమం బజ్ కూడా లేదు 'తుడరుమ్'కు. కానీ తొలి రోజు అదిరిపోయే టాక్ వచ్చింది. లాలెట్టన్‌ను ఇలాంటి కామన్ మ్యాన్ పాత్రల్లో చూడడం భలేగా ఉంటుందని.. ఇలాంటి పాత్రలు చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ కావాల్సిందే అని ఇటు విశ్లేషకులు, అటు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. లాలెట్టన్ కెరీర్లోనే 'తుడరుమ్' బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.