మాలీవుడ్ మెగాస్టార్ (X) టాలీవుడ్ మెగాస్టార్
బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్. ఇటీవల ఎల్ 2 - ఎంపూరన్, తుడరుమ్ చిత్రాలతో బంపర్ హిట్లు అందుకున్నారు.
By: Tupaki Desk | 20 May 2025 6:00 AMబ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్. ఇటీవల ఎల్ 2 - ఎంపూరన్, తుడరుమ్ చిత్రాలతో బంపర్ హిట్లు అందుకున్నారు. ఈ రెండు సినిమాల్లో లాల్ నటనకు ప్రజలు ఫిదా అయిపోయారు. ఎల్ 2 ఏకంగా 350కోట్లు వసూలు చేయగా, తుడారమ్ 100 కోట్ల నికర వసూళ్లను సాధించిందని కథనాలొచ్చాయి.
ఇక ఇదే హుషారులో లాల్ వెంట వెంటనే ప్రాజెక్టును ఖాయం చేస్తూ, వాటిని వేగంగా రిలీజ్ కి తెస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేస్తుండడం ప్రేరణనిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లాల్ ఓనం సందర్భంగా 'హృదయపూర్వం' సినిమాను రిలీజ్‌కి తెస్తున్నారు. ఈ సినిమా విడుదలై హిట్టు కొడుతుందనే నమ్మకంతో లాల్ ఉన్నాడు. ఒకవేళ ఇది కూడా విజయం సాధిస్తే ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ అందుకున్న ఏకైక క్రేజీ స్టార్ గా లాల్ పేరు మార్మోగుతుంది. హృదయపూర్వం అనేది సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్ కానుంది. తదుపరి మంచు విష్ణు `కన్నప్ప`లో కూడా లాల్ కనిపిస్తారు. దీంతో పాటు మోహన్ లాల్ వృషభ, రామ్ లతో మరో చిత్రంలోను నటిస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా ఏడెనిమిది సినిమాలు అతడి క్యూలో ఉన్నాయి.
మాలీవుడ్ మెగాస్టార్ దూకుడు చూస్తుంటే, అతడికి సహచరుడే అయినా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రేసులో వెనకబడ్డారని చెప్పక తప్పదు. చిరు బ్యాక్ టు బ్యాక్ వేగంగా సినిమాలు చేయాలని మెగాభిమానులు కోరుకుంటారు. కానీ ఆయన మాత్రం తీరిగ్గా 'విశ్వంభర' కోసమే శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా ఏడాది పైగానే శ్రమించారు. అయినా ఇప్పటికీ దీనిపై పూర్తి క్లారిటీ రాలేదు. లాల్ తరహాలో చిరంజీవి కూడా వెంట వెంటనే సినిమాలు చేసి రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.