అప్పట్నుంచే నాకు ఆవేశం పెరిగింది
ప్రస్తుతం కన్నప్ప సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు సీనియర్ నటుడు మోహన్ బాబు.
By: Tupaki Desk | 5 April 2025 12:04 PM ISTప్రస్తుతం కన్నప్ప సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు సీనియర్ నటుడు మోహన్ బాబు. కన్నప్ప సినిమాలో మహదేవ శాస్త్రి పాత్రలో నటించిన ఆయనే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మంచు విష్ణు హీరోగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడా సినిమాను వాయిదా వేశారు.
రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న మోహన్ బాబు కన్నప్ప సినిమా గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి, సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ట్రోలింగ్స్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. జీవితంలో ఎన్నో ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చినట్టు తెలిపిన మోహన్ బాబు ఎవరికీ చెప్పకుండా 4 కి.మీ నడుచుకుంటూ వెళ్లి మరీ రాజమకుటం అనే సినిమా చూసినట్టు చెప్పారు.
1975లో స్వర్గం- నరకం అనే సినిమాలో విలన్ గా దాసరి నారాయణరావు తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారని, అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ కంటిన్యూ అవుతున్నానని, ప్రతిజ్ఞ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారానని, తన బ్యానర్ ను సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారని, ఆ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టారని, తన సొంత బ్యానర్ లో ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి మరీ మేజర్ చంద్రకాంత్ సినిమా తీశానని, అన్న ఎన్టీఆర్ గారు ఎంత వద్దని చెప్పినా వినకుండా మొండిగా ఆ సినిమా తీశానని, ఆ సినిమా మంచి సక్సెస్ అయిందని మోహన్ బాబు తెలిపారు.
జీవితంలో తాను కోరుకున్నవన్నీ జరిగాయంటున్న మోహన్ బాబు, రాజకీయాలు తనకు సెట్ అవ్వవన్నారు. మిగిలిన జీవితాన్ని పిల్లలతో సరదాగా గడుపుతూ మంచి పాత్రలేవైనా వస్తే చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుమారు 560 సినిమాలు చేశానని చెప్తున్న ఆయన, తన సినిమాలు ఫెయిలైనా, నటుడిగా తానెప్పుడూ ఫెయిలవలేదని అన్నారు. తనకు ఆవేశం ఎక్కువని, కానీ ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని, తననే చాలా మంది మోసం చేశారని, అప్పట్నుంచే తనకు ఆవేశం పెరిగిందని, ఆ ఆవేశమే తనకు నష్టాన్ని కలిగించిందని మోహన్ బాబు పేర్కొన్నారు.
ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ తాను కూడా చూస్తుంటానని, వాటిని అసలు పట్టించుకోనంటున్న మోహన్ బాబు, పక్క వాళ్లు నాశనమవ్వాలని ఎప్పుడూ కోరుకోకూడదని, అలా కోరుకుంటే ముందు మనమే నాశనమవుతామని అన్నారు. ట్రోల్ చేసి ఎదుటివారిని బాధ పడితే వాళ్లకేం వస్తుందో ఇప్పటికీ కాదంటున్న మోహన్ బాబు, దేవుడి దయ వల్లే కన్నప్ప సినిమాలో ఛాన్స్ వచ్చిందని, శివుని ఆశీస్సులతోనే కన్నప్ప సినిమా పూర్తైందని అన్నారు.
