Begin typing your search above and press return to search.

క‌మ‌ర్షియ‌ల్‌గా ఫ్లాపైనా ఆస్కార్ బ‌రిలోకి?

ఇది ఆస్కార్ నామినేష‌న్ల‌కు ఎందుకు అర్హ‌మైనదో తెలియాలంటే సినిమా క‌థాంశం గురించి తెలుసుకుని తీరాలి.

By:  Tupaki Desk   |   14 Oct 2023 10:30 AM GMT
క‌మ‌ర్షియ‌ల్‌గా ఫ్లాపైనా ఆస్కార్ బ‌రిలోకి?
X

ఖిలాడీ అక్షయ్ కుమార్ న‌టించిన‌ 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ' బాక్సాఫీస్ ఫ‌లితం ఎలా ఉన్నా, ఈ సినిమాని మేకర్స్ ఆస్కార్‌కు పంపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అక్ష‌య్ కుమార్ తన కెరీర్‌లో రిస్క్ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో ఎన్నో చిత్రాల్లో న‌టించారు. వాటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితం ద‌క్కించుకున్నా కానీ రాణీగంజ్ వైఫ‌ల్యం నిరాశ‌ప‌రిచింది. బేబీ మొద‌లు.. ఎయిర్‌లిఫ్ట్, మిషన్ మంగళ్, కేసరి వంటి చిత్రాల‌తో అత‌డు ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాలు అందుకున్నాడు. అందుకే మిషన్ రాణిగంజ్ విజ‌యం సాధిస్తుంద‌ని ఆశించాడు. కానీ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో ఈ సినిమా విఫ‌ల‌మైంది.

గత శుక్రవారం విడుదలైన 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ' ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో కొన‌సాగుతున్నా ఆశించిన మేర‌కు జ‌నాద‌ర‌ణ ద‌క్కించుకోక‌పోవ‌డంపై పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిరాశ చెందింది. కానీ కంటెంట్ ఉన్న త‌మ సినిమాను ఆస్కార్‌కు పంపిస్తున్నందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఇది ఆస్కార్ నామినేష‌న్ల‌కు ఎందుకు అర్హ‌మైనదో తెలియాలంటే సినిమా క‌థాంశం గురించి తెలుసుకుని తీరాలి.

13 నవంబర్ 1989న పశ్చిమ బెంగాల్‌ రాణిగంజ్‌లోని మహాబీర్ కొలియరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఎవ‌రో ప్రమాదవశాత్తూ గని ఎగువ సీమ్‌ను తాకడంతో భారీగా జ‌ల‌పాతం లోనికి దూసుకొచ్చింది. అయితే ఈ విప‌త్తు నుంచి కార్మికుల‌ను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరిగింది?.. రిస్క్ ఆప‌రేష‌న్ అధికారి జస్వంత్ సింగ్ గిల్ అమలు చేసిన ప్లాన్ ఏమిటి? అతను ఎలా విజయం సాధించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నాటి రెస్క్యూ అధికారి, నిజ జీవిత వీరుడు అయిన జస్వంత్ సింగ్ గిల్ కుమారుడు డాక్టర్ సర్ప్రీత్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. రాణీగంజ్ ఘటనను ప్రపంచానికి తెలియాల్సిన‌ ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు. "సమాజం నుండి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వారి కథలు... ఎప్పటికీ బయటకు రాని, ఎక్కడో దాచిపెట్టిన, అంత‌గా ఎవ‌రికీ తెలియ‌ని హీరోల‌ను ఈ ప్రపంచం గుర్తిస్తుంది. చాలా మంది వ్యక్తులు నిస్వార్థంగా ధైర్యంగా ఎలా ఉండాలో, మానవాళికి లేదా ప్రజలకు సహాయం అవసరమైనప్పుడు ఏం చేయాలో ఈ సినిమా నేర్పిస్తుంది. ఇది భ‌విష్య‌త్‌ తరాలను ప్రభావితం చేస్తుంది. మన దేశంలో అంత‌గా ప్రాచుర్యం ల‌భించ‌ని నిజ జీవిత హీరోల క‌థ‌ల‌ను సినిమాగా తీయ‌డానికి పురి కొల్పుతుంది. ప్ర‌జ‌ల‌కు ఇది ప‌రోక్షంగా సహాయం చేస్తుంది. మేము అలాంటి వ్యక్తులపై మరిన్ని సినిమాలు చేస్తాము. మిషన్ రాణిగంజ్ రూపుదిద్దుకున్న విధానం ఖచ్చితంగా అద్భుతమైనది... అని వ్యాఖ్యానించారు. రాణి గంజ్ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా రాణించ‌క‌పోయినా అకాడెమీ పుర‌స్కారాల‌కు వెళుతుండ‌డం కొంతవ‌ర‌కూ మేక‌ర్స్ కి ఉప‌శ‌మ‌నం అని భావించాలి.