Begin typing your search above and press return to search.

MI అడ్వెంచ‌ర్స్ స్టార్ హీరో వేట త‌గ్గేదేలే

ఇంత‌కుముందు మిష‌న్ ఇంపాజిబుల్ (ఎంఐ) : డెడ్ రిక‌నింగ్ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

By:  Tupaki Desk   |   8 April 2025 9:06 AM IST
MI అడ్వెంచ‌ర్స్ స్టార్ హీరో వేట త‌గ్గేదేలే
X

గాల్లో సాహ‌స‌ విన్యాసాలు.. విమానాల‌పై నుంచి జంప్‌లు.. వేగంగా ప్ర‌యాణించే వాహ‌నాల్లో విల‌న్ల‌తో అరివీర భ‌యంక‌ర పోరాటాలు.. స‌ముద్ర జ‌లాల‌పై షిప్ ల నుంచి యుద్ధ విమానాల దూకుడు.. వెప‌న్ వార్.. భూమిపై కార్ ఛేజ్ లు .. ఒక‌టేమిటి ప్ర‌తి ఫ్రేమ్‌లో ఏదో ఒక గ‌గుర్పాటుకు గురి చేసే సాహ‌సాన్ని చూడ‌కుండా ఉండ‌లేం. అలాంటి గొప్ప స్పై అడ్వెంచ‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో టామ్ క్రూజ్ త‌ర్వాతే. ద‌శాబ్ధాలుగా మిష‌న్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ త‌న ఫ్యాన్స్ ని ఎగ్జ‌యిట్ చేస్తూనే ఉంది.

ఇంత‌కుముందు మిష‌న్ ఇంపాజిబుల్ (ఎంఐ) : డెడ్ రిక‌నింగ్ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ది మిష‌న్ ఇంపాజిబుల్: ఫైన‌ల్ రిక‌నింగ్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. అందుకు సంబంధించిన ట్రైల‌ర్ ని టామ్ స్వ‌యంగా రిలీజ్ చేయ‌గా అది సంచ‌ల‌నంగా మారింది. ప్రతి ఎంపిక, ప్రతి మిషన్, అన్నీ దీనికి దారితీశాయి. మిషన్: ఇంపాజిబుల్- ది ఫైనల్ రెకనింగ్. 23 మే 2025న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది! అని తెలిపారు.

తాజా చిత్రంలో టామ్ క్రూజ్ హంట్ విల‌క్ష‌ణ‌మైన‌ది. `ది ఎంటిటీ` అని పిలుచుకునే శక్తివంతమైన AIకి వ్యతిరేకంగా టామ్ తన పోరాటాన్ని కొనసాగిస్తాడు. డెడ్ రిక‌నింగ్ ముగిసిన చోటి నుంచి ఫైన‌ల్ రిక‌నింగ్ సినిమా ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించ‌గా, పారామౌంట్ పిక్చర్స్- స్కైడాన్స్ సమర్ప‌ణ‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. హన్నా వాడింగ్‌హామ్, నిక్ ఆఫర్‌మాన్, కేటీ ఓ బ్రియన్, ట్రామెల్ టిల్‌మాన్ త‌దిత‌రులు న‌టించారు.