మిడ్ నైట్ 50 మందికి చుక్కలు చూపించిన థియేటర్
ఇప్పుడు ఘట్కోపర్‌లోని ఐనాక్స్ ఆర్-సిటీలో `మిషన్ ఇంపాజిబుల్` షో విషయంలో మరోసారి ప్రేక్షకులకు చుక్కలు చూపించారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 26 May 2025 3:31 PM ISTకొద్దిరోజుల క్రితం పాపులర్ మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమా ప్రదర్శన కోసం ఎదురు చూసిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగల్చడమే గాక గంటల కొద్దీ సమయం వృధా అయ్యాక, ప్రదర్శన రద్దయిందని నిర్లక్ష్యంగా ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసారని కథనాలొచ్చాయి.
ఇప్పుడు ఘట్కోపర్‌లోని ఐనాక్స్ ఆర్-సిటీలో `మిషన్ ఇంపాజిబుల్` షో విషయంలో మరోసారి ప్రేక్షకులకు చుక్కలు చూపించారని తెలుస్తోంది. 10.30 పీఎం షో కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్న 50 మంది సినీ ప్రేక్షకులు చివరికి గంట పైగా వేచి చూసి నిరాశతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. 11.30 -12 మిడ్ నైట్ వరకూ అదే థియేటర్ వద్ద ప్రేక్షకులు పడిగాపులు పడ్డారు. మరో ఐదు నిమిషాల్లో షో ప్రదర్శిస్తామని చెప్పుకుంటూ వచ్చిన నిర్వాహకులు, గంటన్నర సేపు వెయిట్ చేయించారు. కానీ చెప్పిన ప్రకారం షో వేయలేకపోయారు. పైగా వారు చెప్పిన కారణానికి అక్కడ జరిగిన సన్నివేశానికి పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు సీరియస్ అయ్యారు.
థియేటర్ లో గంటల కొద్దీ సమయం వేచి చూసిన వారిలో వృద్ధులు, పిల్లలతో పాటు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నాయి. వీరంతా తమ అసహనం వ్యక్తం చేసారు. పైగా ఫుడ్ కూపన్స్ కోసం పే చేసిన డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరిన ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం తలబిరుసుగా సమాధానం ఇచ్చింది. అయితే షో రద్దవ్వడం ఇక్కడ సమస్య కాదు. దానికి మించి నిర్వాహకులు వైఫల్యం తర్వాత కూడా తమను తాము సమర్థించుకోవడం, పొంతన లేని సమాధానాలు చెబుతూ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం అసలు సమస్య. తలెత్తిన సమస్య గురించి నిజం ఏమిటన్నది మాట్లాడకపోగా, అబద్ధాలతో బొంకేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రేక్షకులు తీవ్ర గందరగోళానికి గురవ్వడమే గాక, అవమానాలు ఎదురయ్యాయని ఆరోపించారు.
థియేటర్ సభ్యుడు ఒకరు `కెడిఎమ్‌తో సాంకేతిక సమస్య` అని చెప్పారు. కానీ థియేటర్ లో ప్రొజెక్షన్ ఆపరేటర్ లేరని ప్రేక్షకులు గమనించారు. సినిమా వేసే ముందు ప్రకటనలు వేయలేదు.. సినిమాని కూడా వేయలేదు. అయితే ఇంత జరిగినా స్పాట్ లో ఉన్న సిబ్బంది తలతిక్కగా సమాధానాలిచ్చారు. ``ఇంటికి వెళ్లి బుకింగ్ యాప్‌ల నుండి వాపసు పొందండి`` అని అవమానకరంగా మాట్లాడారు. అయితే ఇలాంటి సందర్భాల్లో సంయమనంతో థియేటర్ సిబ్బంది ప్రేక్షకులను క్షమాపణలు కోరలేదు సరికదా.. గందరగోళానికి గురి చేసారు. వారిలో జవాబుదారీతనం లేకపోవడం నిరాశపరిచింది. దీంతో ప్రేక్షకులు ఐనాక్స్ నిర్వాహకులను తిడుతూ, ఇక ఎప్పటికీ ఇలాంటి చెత్త థియేటర్లకు రాకూడదని శపథం చేసారు. ఇలాంటి ఘటనలు ఎగ్జిబిషన్ రంగానికి గోరు చుట్టుపై రోకటిపోటు అనడంలో సందేహం లేదు. అసలే థియేటర్ల రంగం నష్టాల్లో ఉందని చెబుతున్నారు. నిర్వహణా లోపంతో ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే దానికి బాధ్యత వహించాల్సింది కూడా థియేటర్ల యాజమాన్యమే.
