Begin typing your search above and press return to search.

ఇండియాలో MI సిరీస్ 8వ సినిమా హ‌వా!

టామ్ క్రూజ్ మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు.

By:  Tupaki Desk   |   11 May 2025 6:13 PM
Mission: Impossible Final Reckoning Set to Shatter Indian Box Office
X

టామ్ క్రూజ్ మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. గ‌గుర్పొడిచే సాహ‌స‌విన్యాసాల‌తో గూఢఛారి ఈథ‌న్ హంట్ (టామ్) ని తెర‌పై చూడాల‌ని అభిమానులు ఉవ్విళ్లూరతారు. ఈ సిరీస్ లో ఇప్ప‌టికే ఏడు సినిమాలు వ‌చ్చి ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇప్పుడు సిరీస్ లో చివ‌రిది అయిన ఎనిమిదో చిత్రం `మిష‌న్ ఇంపాజిబుల్ ఫైన‌ల్ రిక‌నింగ్` విడుద‌ల‌వుతోంది. ఎం.ఐ సిరీస్ ముగిసింది అనుకుంటున్న వేళ ఈ కొత్త సినిమా రికార్డుల మోత మోగించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇత‌ర భాగాల్లానే ఈసారి ఎనిమిదో భాగంలోను టామ్ సాహ‌స విన్యాసాలు గ‌గుర్పాటుకు గురి చేస్తున్నాయి.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు పీవీఆర్ ఐనాక్స్, సినీపోలీస్ స‌హా టాప్ 3 థియేట్రిక‌ల్ చైన్స్ లో ఒక‌ట‌వ రోజు 10వేల టికెట్లు సేల్ కాగా, వారాంతంలో రోజుకు 15వేల టికెట్లు తెగుతున్నాయ‌ని అంచ‌నా. మొద‌టి రోజు ఫైన‌ల్ రిక‌నింగ్ చిత్రం భార‌త‌దేశంలో ఏకంగా 17 కోట్ల నుంచి 20కోట్ల మ‌ధ్య వ‌సూలు చేస్తుంద‌ని భావిస్తున్నారు. నిజానికి ఈ ఫ్రాంఛైజీలో ఏడో చిత్రం సుమారు 13కోట్ల డేవ‌న్ వ‌సూళ్ల‌ను సాధించింది. దాంతో పోలిస్తే ఈసారి ఎనిమిదో చిత్రం ఫ్రాంఛైజీలో అత్య‌ధికంగా వ‌సూలు చేయ‌నుంది. శ‌నివారం నాడు (మే 17)న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం వీకెండ్ లో శ‌ని-ఆదివారాల్లో భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అన్ని మెట్రో న‌గ‌రాలు స‌హా ఆన్ లైన్ , ఇత‌ర మార్గాల్లో మూడు జాతీయ గొలుసులను కలిపి మొత్తం 1.25 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని కూడా చెబుతున్నారు. ఎం.ఐ సిరీస్ సినిమాల‌కు ప్ర‌చార ఖ‌ర్చు లేకుండానే భారీ ఓపెనింగులు ద‌క్క‌డం ప్ర‌తిసారీ చూస్తున్న‌దే. ఇప్పుడు ఎనిమిదో చిత్రం అందుకు మిన‌హాయింపు కాదు.

అవ‌తార్, అవెంజ‌ర్స్, సూప‌ర్ మేన్ వంటి భారీత‌నం నిండిన ఫ్రాంఛైజీలు భార‌త‌దేశంలో 100కోట్ల వ‌సూళ్ల‌ను సునాయాసంగా సాధించాయి. అవ‌తార్ భార‌త‌దేశంలో మూడు ద‌ఫాలుగా విడుద‌లై ఏకంగా 300కోట్లు వసూలు చేసింది. అలాగే బాండ్ సిరీస్ సినిమాలు భారీ వ‌సూళ్ల‌ను న‌మోదు చేసాయి. స్పై సినిమాల్లో మిష‌న్ ఇంపాజిబుల్ కి ఈ త‌ర‌హా క్రేజ్ ఉంది.