భారత్ నుంచి ఆరుగురికి 'మిస్ వరల్డ్' కిరీటం.. వాళ్లిప్పుడేం చేస్తున్నారంటే!
ఈ సందర్భంగా గతంలో మన భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన వాళ్ళు ఎవరు, వాళ్లిప్పుడేం చేస్తున్నారో చూద్దాం.
By: Tupaki Desk | 31 May 2025 3:59 PM ISTమిస్ వరల్డ్ పోటీలు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి అందమైన అమ్మాయిలు, మోడ్రన్ దుస్తులు, క్యాట్‌వాక్. కానీ, ఈ పోటీల వెనుక మహిళలు స్ట్రాంగ్ గా మారడం, వాళ్ల ఎదుగుదల, కరుణ లాంటి చాలా మంచి విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా పేరున్న ఈ 'మిస్ వరల్డ్' పోటీల్లో భారతదేశానికి మంచి గుర్తింపు ఉంది. మన దేశం ఇప్పటివరకు ఆరు సార్లు గెలిచి, ఎక్కువ టైటిల్స్ సాధించిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు వచ్చాయి. ఈ సందర్భంగా గతంలో మన భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన వాళ్ళు ఎవరు, వాళ్లిప్పుడేం చేస్తున్నారో చూద్దాం.
భారత్ నుంచి 'మిస్ వరల్డ్' కిరీటాన్ని గెలుచుకున్న ఆరుగురు అందగత్తెలు
1. రీటా ఫారియా (1966): ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రీటా ఫారియా చరిత్ర సృష్టించారు. 1966లో ఆమె విజేతగా నిలిచినప్పుడు ఆమె వైద్య విద్యార్థిని. కిరీటం గెలిచిన తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చినా, ఆమె తన వైద్య వృత్తిని కొనసాగించారు. ప్రజలకు సేవ చేయడానికే ఆమె ప్రాధాన్యతనిచ్చారు. ప్రస్తుతం ఆమె డబ్లిన్, ఐర్లాండ్‌లో తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు.
2. ఐశ్వర్య రాయ్ (1994): అందం, అభినయం కలగలిసిన ఐశ్వర్య రాయ్ 1994లో 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ కిరీటం ఆమెకు బాలీవుడ్‌లోకి ప్రవేశించడానికి ఒక మార్గం చూపింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో అగ్ర నటిగా, మోడల్‌గా కొనసాగుతూనే, వివిధ అంతర్జాతీయ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొంటారు.
3. డైలానా హేడెన్ (1997): 1997లో 'మిస్ వరల్డ్' కిరీటాన్ని గెలుచుకున్న డయానా హేడెన్, ఆ తర్వాత మోడలింగ్, నటన రంగాల్లో ప్రవేశించారు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా, పెద్దగా రాణించలేకపోయారు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ పేజెంట్‌లలో ట్రైనర్‌గా, మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్నారు.
4. యుక్తా ముఖి (1999): 1999లో 'మిస్ వరల్డ్' టైటిల్‌ను గెలుచుకున్న యుక్తా ముఖి బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించారు. సామాజిక కార్యకర్తగా, పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆమె ఆసక్తి చూపుతారు.
5. ప్రియాంక చోప్రా (2000): 2000వ సంవత్సరంలో 'మిస్ వరల్డ్' కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక చోప్రా, భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌లో కూడా సినిమాలు, టీవీ షోలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి (UNICEF) గుడ్‌విల్ అంబాసిడర్‌గా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
6. మానుషి చిల్లర్ (2017): వైద్య విద్యార్థిని అయిన మానుషి చిల్లర్ 2017లో 'మిస్ వరల్డ్' కిరీటాన్ని గెలుచుకుని, రీటా ఫారియా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ వైద్య విద్యార్థిని అయ్యారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టి, నటిగా కొనసాగుతున్నారు. వైద్య రంగంలో కూడా ఆమె తన సేవలను అందిస్తున్నారు.
ఈ అందాల రాణులు భారతదేశానికి అంతర్జాతీయ వేదికపై గర్వాన్ని తీసుకురావడమే కాకుండా తమ వృత్తులు, సామాజిక సేవలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. నేడు హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ ఫైనల్‌లో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మరోసారి భారత్ కిరీటాన్ని గెలుచుకుంటుందేమో వేచి చూడాలి.
