Begin typing your search above and press return to search.

ముంబయిలో కిరీటం పెట్టుకొని.. హైదరాబాద్ లో ఇచ్చేసిందిగా!

మూడు వారాలుగా హైదరాబాద్ మహానగర వేదికగా సాగుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఫైనల్ ఘట్టం అనుకున్నట్లే అంగరంగ వైభవంగా ముగిసింది

By:  Tupaki Desk   |   1 Jun 2025 10:23 AM IST
ముంబయిలో కిరీటం పెట్టుకొని.. హైదరాబాద్ లో ఇచ్చేసిందిగా!
X

మూడు వారాలుగా హైదరాబాద్ మహానగర వేదికగా సాగుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఫైనల్ ఘట్టం అనుకున్నట్లే అంగరంగ వైభవంగా ముగిసింది. తాజా ప్రపంచ సుందరిగా మిస్ థాయిలాండ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజా విజేతకు గత ఏడాది మిస్ వరల్డ్ గా నిలిచిన చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిజ్కోవా తన కిరీటాన్ని తీసి తాజా విజేతకు అలకరించటం ద్వారా ఆమె అందాల ప్రయాణం ముగిసినట్లైంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నది.. తిరిగి ఇచ్చేసింది ఒకే దేశంలో కావటం ఒక ఆసక్తికర అంశంగా చెప్పాలి. 2024 మార్చి 9న ముంబయి వేదికగా జరిగిన ప్రపంచ సుందరి 71వ ఎడిషన్ పోటీల విజేతగా ఆమె నిలిచారు. అనంతరం ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించారు. తాజా మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరుగుతున్న నేపథ్యంలో గడిచిన మూడు వారాలుగా ఆమె భాగ్యనగరిలోనే ఉన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోటీల ఆరంభ వేడుకలు మొదలు శనివారం ముగింపు పోటీల వరకు ప్రధాన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఇతర కంటెస్టెంట్లతో పాటు యాదాద్రి ఆలయ ప్రదర్శన.. చేతన చీరను ధరించటం లాంటి ఎన్నో పనులు చేవారు. తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రదేశాల్ని సందర్శించారు. ఏడాది కాలంగా తనతో ఉన్న మిస్ వరల్డ్ కిరీటాన్ని తాజా విజేత సుచాతకు అలకరించటం ద్వారా తన ప్రపంచ సుందరి హోదా నుంచి తప్పుకున్నారు. ఆమె అందాల ప్రయాణం ముంబయిలో మొదలైతే.. హైదరాబాద్ లో ముగిసిందని చెప్పాలి.

తన దేశానికి తిరిగి వెళుతూ.. ఏడాదిగా తన అనుభూతుల్ని పంచుకున్న ఆమె.. ‘మిస్ వరల్డ్ కిరీటం గెలవటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ధరించిన కిరీటం కంటే నేర్చుకున్న విషయాలు.. అద్భుతమైన గురుతులతో తన మనసంతా నిండిపోయింది. ఈ ప్రయాణం నాకో లక్ష్యాన్ని ఏర్పర్చుకోవటానికి.. దానికి చేరుకునేందుకు అవసరమైన దారిని చూపించింది. జీవించటానికి ఉన్న పరామర్థాన్ని నేర్పించింది. ఇంటికి వెళుతూ.. ఏడాది కాలంగా నేను కలిసిన వ్యక్తులు.. తిరిగిన ప్రాంతాలను గురుతులుగా వెంట తీసుకెళుతున్నా’ అంటూ ఉద్వేగానికి గురి అవుతూ ముక్తాయించింది.