మిస్ వరల్డ్ గెలిస్తే జీవితం ఎలా మారుతుంది? ఓపల్ సుచాతాకు లభించే అవకాశాలివే!
ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ (Miss World) పోటీలు కేవలం అందాల ప్రదర్శన మాత్రమే కాదు.
By: Tupaki Desk | 1 Jun 2025 9:40 AM ISTప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ (Miss World) పోటీలు కేవలం అందాల ప్రదర్శన మాత్రమే కాదు. ఈ కిరీటాన్ని గెలుచుకున్న వారికి కేవలం ప్రైజ్ మనీతో పాటు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, అపారమైన అవకాశాలు, సామాజిక సేవకు ఒక వేదిక లభిస్తాయి. తాజాగా 72వ మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతా జీవితం ఒక్క రాత్రిలో మారిపోయిందని చెప్పొచ్చు. ఆమెకు లభించే నగదు బహుమతితో పాటు, అంతకు మించిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
మిస్ వరల్డ్ విజేతకు అందే తక్షణ ప్రయోజనాల్లో భారీ నగదు బహుమతి, విలువైన కిరీటం ముందుంటాయి. విజేతగా నిలిచిన ఓపల్ సుచాతాకు దాదాపు రూ.8.5 కోట్ల (1 మిలియన్ అమెరికన్ డాలర్లు) ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, ప్రధాన స్పాన్సర్‌లు అందజేస్తారు. అత్యంత విలువైన వజ్రాల కిరీటం ఆమె సొంతమవుతుంది. ఈ కిరీటం విలువ లక్ష అమెరికన్ డాలర్లకు పైగా ఉంటుంది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం అంటే కేవలం ప్రైజ్ మనీతో సరిపోదు. అది అంతర్జాతీయ స్థాయిలో ఒక యువతికి తక్షణమే అపారమైన గుర్తింపును అందిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆమె ఒక గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోతుంది. బాలీవుడ్, హాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో భారీ అవకాశాలు వెల్లువెత్తుతాయి. గతంలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా వంటి మిస్ వరల్డ్ విజేతలు సినీ రంగంలో ఎంతగా రాణించారో చూశాం. ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లు, అంతర్జాతీయ మ్యాగజైన్‌ల నుంచి భారీ మోడలింగ్ కాంట్రాక్టులు వస్తాయి. సౌందర్య ఉత్పత్తులు, ఫ్యాషన్ బ్రాండ్‌లు, ఆభరణాల సంస్థలు, లగ్జరీ వస్తువుల కంపెనీలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ఆహ్వానిస్తాయి. దీని ద్వారా కోట్లలో సంపాదించే అవకాశం ఉంటుంది.
విజేతకు ఏడాది పాటు లగ్జరీ జీవనం, ఉన్నత స్థాయి వసతులు కల్పిస్తారు. ఏడాది పొడవునా లండన్‌లో అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ఉచితంగా నివసించే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ స్టైలిస్టులు, ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఖరీదైన డిజైనర్ దుస్తులు, మేకప్ కిట్లు, నగలు ఉచితంగా లభిస్తాయి. ఆమె ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక పోషకాహార నిపుణులు, ట్రైనర్లు ఉంటారు.
మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వారికి కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా, సామాజిక సేవకు ఒక గొప్ప వేదిక లభిస్తుంది. ఈ కార్యక్రమానికి 'బ్యూటీ విత్ ఏ పర్పస్' అని పేరు. మిస్ వరల్డ్ విజేతగా, ఏడాది పొడవునా ఆమె ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం ఉంటుంది. వివిధ దేశాల్లో జరిగే ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరపున ఆమె అనేక దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడానికి, నిధులు సేకరించడానికి కృషి చేస్తుంది. ఇది ఆమెకు సమాజంపై సానుకూల ప్రభావం చూపే గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఇవన్నీ కలిపి మిస్ వరల్డ్ టైటిల్ విజేత జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. కేవలం అందంతో పాటు, తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక దృక్పథం ఉన్నవారికి ఇది ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది.
