Begin typing your search above and press return to search.

మిస్ వరల్డ్ పోటీల్లో అరుదైన ఘటన.. మిస్ ఇంగ్లండ్ వైదొలగడంపై చర్చ!

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 అంతర్జాతీయ పోటీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   24 May 2025 6:53 PM IST
మిస్ వరల్డ్ పోటీల్లో అరుదైన ఘటన..  మిస్ ఇంగ్లండ్ వైదొలగడంపై చర్చ!
X

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 అంతర్జాతీయ పోటీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనూహ్యంగా బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పోటీ నుంచి వైదొలిగారు. ఈ పరిణామంతో కలకలం ఏర్పడింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఒక దేశ ప్రతినిధి పోటీల మధ్యలోనే వైదొలగడం ఇది మొదటిసారి.

మిలా మాగీ మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలను బహిష్కరించి స్వదేశం వెళ్లిపోయింది. అక్కడ 'ది సన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. నిర్వాహకులు తన పట్ల వ్యవహరించిన తీరు నచ్చకే పోటీల నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు కొన్ని పద్ధతులు పాటించమని కోరారని, అవి తన వ్యక్తిగత విలువల పట్ల అసంతృప్తి కలిగించాయని ఆమె పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ మేకప్‌తోనే ఉండాలని కోరారు.

అసలు మిస్‌ వరల్డ్‌ పోటీలను గడువుతీరిన షోగా అభివర్ణించింది. ఇలాంటి విలువల్లేని చోట తాను ఉండకూడదని తప్పుకుంటున్నాన్నట్లు ఆమె ఆ మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం అందాన్ని మాత్రమే కాకుండా, సామాజిక సేవ, మార్పును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తాను పోటీల్లోకి వచ్చినట్లు, కానీ అక్కడ అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మిస్ ఇంగ్లండ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు స్పందించారు. మిల్లా వాదనలు నిరాధారం, పూర్తిగా కల్పితమైనవి అని వారు తోసిపుచ్చారు. ఆమె పోటీల నుంచి వైదొలిగేటప్పుడు వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కారణంగా పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు మిల్లా మాగీ ప్రకటించారని వారు తెలిపారు.

మిస్ వరల్డ్ పోటీల 74 ఏళ్ల చరిత్రలో పోటీల మధ్యలోనే ఒక దేశ ప్రతినిధి ఇలాంటి కారణాలతో వైదొలగడం ఇది మొదటిసారి. మిల్లా మాగీ తప్పుకోవడంతో మిస్ లివర్‌పూల్ అయిన షార్లెట్ గ్రాంట్ ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 పోటీలలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం 20 మంది పోటీదారులు సెలక్ట్ అయ్యారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా అండ్ కరేబియన్ ఖండాల నుంచి 20 మంది పోటీదారులు హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. గ్రాండ్ ఫినాలే ఈ నెల 31న జరగబోతుంది. ఆ రోజే మిస్ వరల్డ్ 2025ను ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్ నుండి మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు లభించలేదు.