ఫిష్ వెంకట్ ను ప్రభుత్వం తరపున ఆదుకుంటాం: తెలంగాణ మంత్రి
ఇప్పుడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఆర్ బీఎం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందుకుటున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారు.
By: Tupaki Desk | 7 July 2025 3:25 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన యాక్టింగ్, కామెడీ, రౌడీయిజం తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్.. ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అభిమానులు, సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
కొన్నేళ్లుగా రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ ద్వారా ఫిష్ వెంకట్ చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఆర్ బీఎం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందుకుటున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో నుంచి ఎవరైనా వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
తాజాగా ఆయనను తెలంగాణ పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. తక్షణ వైద్య ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. పలువురు వైద్యులతో చర్చించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఫిష్ వెంకట్ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి మళ్లీ నటనా జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఫిష్ వెంకట్ అన్న పరిస్థితి కోసం వాట్సాప్ గ్రూపుల్లో చూసి బాధపడ్డానని చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకుని పరామర్శించడానికి వచ్చానని అన్నారు. తెలంగాణ మారుమూల యాసను వెండితెరకు పరిచయం చేసిన వారిలో ఫిష్ వెంకట్ ఒకరని తెలిపారు. చాలా కింద స్థాయి నుంచి కళా నైపుణ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.
ఫిష్ వెంకట్ ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. చికిత్స విషయంలో ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఆదుకుంటామని చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విషయం తెలియజేస్తానని వెల్లడించారు.
