48 గంటల AI ఫిల్మ్‌మేకింగ్ ఛాలెంజ్.. తెలుగు క్రియేటర్లు పోటీపడ్డారా?
దీనిలో ఏకంగా 180 మంది క్రియేటర్లు పోటీ పడగా.. మన తెలుగు వారు ఎందరున్నారు? ఇక్కడి క్రియేటర్లకు అవగాహన ఎంత? అన్నది సస్పెన్స్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే....
By: Sivaji Kontham | 18 Jun 2026 9:39 PM ISTకొన్ని అవకాశాలు అరుదుగా తలుపు తడతాయి. ఔత్సాహిక ఫిలింమేకర్స్ తామేంటో నిరూపించుకునేందుకు కొన్ని వేదికలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని, అక్కడ తామేంటో నిరూపించుకుంటే ఆ తర్వాత అసాధారణ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా కొత్త కమ్యూనికేషన్ నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇటీవల ఏఐలో సినిమాల మేకింగ్ గురించి చాలా చర్చ సాగుతున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా ఏఐ ఫిలింఫెస్టివల్ నే నిర్వహించారు. దీనిలో ఏకంగా 180 మంది క్రియేటర్లు పోటీ పడగా.. మన తెలుగు వారు ఎందరున్నారు? ఇక్కడి క్రియేటర్లకు అవగాహన ఎంత? అన్నది సస్పెన్స్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే....
ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (MIFF) 2026 వేదికగా ఈరోజు సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి) - అంతర్జాతీయ వ్యాపార సృజనాత్మక భాగస్వామ్య సంస్థ (ఎల్.టి.ఎం) సంయుక్తంగా `సినిమా ఏఐ హ్యాకథాన్`ను ప్రారంభించాయి. సినిమా రంగాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అనుసంధానిస్తూ సరికొత్త ప్రయోగాలకు వేదికగా నిలిచిన ఈ 48 గంటల ఏఐ ఫిల్మ్‌మేకింగ్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు భారతదేశం నలుమూలల నుండి సినిమా దర్శకులు, కథకులు, సాంకేతిక నిపుణులు, కంటెంట్ క్రియేటర్లతో కలిపి 180 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
ఎల్.టి.ఎం బ్లూవర్స్ క్రాఫ్ట్‌స్టూడియో నేతృత్వంలో సాగుతున్న ఈ హ్యాకథాన్... సినిమా నిర్మాణంలోని వివిధ దశలలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించి ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్స్‌ను రూపొందించాలని క్రియేటర్లకు సవాల్ విసిరింది. ఈ ఏడాది పోటీ కోసం `ముంబై త్రూ ఏ థౌజండ్ ఐస్` (వేయి కళ్లతో ముంబై) అనే ఆసక్తికరమైన థీమ్‌ను ఎంచుకున్నారు. తమ జ్ఞాపకాలు, ఊహలు, నిజ జీవిత అనుభవాల ఆధారంగా ముంబై నగరాన్ని విభిన్న కోణాల్లో ఆవిష్కరిస్తూ.. ఏఐ సాంకేతికత సాయంతో 90 నుండి 120 సెకన్ల నిడివి గల లఘు చిత్రాలను రూపొందించే పనిలో పార్టిసిపెంట్స్ నిమగ్నమయ్యారు.
ఈ 48 గంటల ఛాలెంజ్ నేటి(18 జూన్) తో ముగియగా, జూరీ సభ్యులు స్క్రీనింగ్ నిర్వహించి అత్యుత్తమ టాప్ 10 చిత్రాలను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. అలా ఎంపిక చేసిన ఆ 10 చిత్రాలను జూన్ 20న MIFF వేదికగా ప్రేక్షకులకు బహిరంగంగా ప్రదర్శించనున్నారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత కథన శైలి ఎలా ఉండబోతోందో చూపేలా ఈ ప్రదర్శన సాగనుంది. ఈ పోటీలో గెలుపొందిన విజేత జట్టుకు రూ.1.5 లక్షల నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.1 లక్ష నగదు, సర్టిఫికేట్ అందజేస్తారు. మిగిలిన ఎనిమిది జట్లకు కూడా వారి ప్రతిభకు గుర్తింపుగా ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు.
సాంకేతికతతో పాటే సినిమా ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కథలు చెప్పే విధానంలో ఏఐ అనేది ఒక కొత్త సరిహద్దు.. సినీమా ఏఐ ద్వారా ఫిలింమేకర్స్, ఆవిష్కర్తలు.. కొత్త సృజనాత్మక అవకాశాలను కనుగొనడానికి మిఫ్ ఒక అద్భుతమైన వేదిక. పార్టిసిపెంట్స్ నుండి వచ్చిన ఉత్సాహభరితమైన స్పందన ఆశాజనకంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. సాంకేతికత, సినిమా కలయికకు ఇదొక చక్కని వేదికగా నిలుస్తోందన్నారు.
క్రియేటివిటీతో పాటు సాంకేతికత జోడిస్తేనే, మంచి కథలు దృశ్యాలుగా మారతాయి. మన ఫిలింమేకర్స్ గ్లోబల్ వరల్డ్ లో కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకుండా.. ఈ టెక్నాలజీ మార్పుకు నాయకత్వం వహించాలనే ఉద్దేశంతోనే ఈ ఏఐ సినిమా హ్యాకథాన్ కు ఆహ్వానించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్‌ఎఫ్‌డీసీతో కలిసి భారతదేశపు క్రియేటివ్ ఎకానమీకి ఏఐ మ్యాజిక్‌ను పరిచయం చేస్తూ.. మిఫ్-2026లో ప్రారంభించడం ఆసక్తికరం. మొత్తానికి విభిన్న రంగాల క్రియేటర్ల భాగస్వామ్యంతో ఈ హ్యాకథాన్ మిఫ్ 2026లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే దాదాపు 180 మంది పార్టిసిపెంట్స్ ఉంటే ఇందులో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది క్రియేటర్లు పాల్గొన్నారో, మనవాళ్లకు దీనిపై అవేర్ నెస్ ఎంత ఉందో వేచి చూడాల్సిందే. మారుతున్న టెక్నాలజీపై మన క్రియేటర్లు కూడా పట్టు సంపాదించాలి. లేదంటే గ్లోబల్ మార్కెట్లో వెనకబడిపోవడం ఖాయం.
