చిన్న మోసమైనా పెను ప్రమాదమే.. మీ బంధంలో 'మైక్రో ఛీటింగ్' ఉందా?
చిన్న మోసమైనా పెద్ద మోసమైనా బాధను కలిగిస్తుంది. పైపైన గోకినా, గుండెల్లో గుచ్చుకున్నా.. గాయం గాయమే.
By: Tupaki Desk | 18 May 2025 5:30 PMచిన్న మోసమైనా పెద్ద మోసమైనా బాధను కలిగిస్తుంది. పైపైన గోకినా, గుండెల్లో గుచ్చుకున్నా.. గాయం గాయమే. తాత్కాలిక ఆకర్షణలు, ఆన్లైన్ మోహాలు నిజాయితీపరులను కూడా చిన్న చిన్న అబద్ధాలు చెప్పేలా చేస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలతో ఈ 'చిన్నపాటి మోసాల' నుంచి బయటపడవచ్చు. భార్యాభర్తల మధ్య లేదా ప్రేమ బంధంలో చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, నిజాలు దాచడం 'మైక్రో ఛీటింగ్' కిందకు వస్తుంది. ఇది పెద్ద నేరం కానప్పటికీ, బంధాలకు బీటలు కలిగిస్తుంది. ఇది ఎక్కడైనా, ఎవరైనా చేయవచ్చు.
ఉదాహరణకు.. ప్రాజెక్ట్ పనిలో ఉన్నానని చెప్పి వేరే వారితో చాటింగ్ చేయడం, రిలేషన్షిప్ స్టేటస్‌లో సింగిల్ అని పెట్టుకోవడం, కాంటాక్ట్ లిస్ట్‌లో ఒక పేరుతో వేరే వ్యక్తి నెంబర్ సేవ్ చేయడం వంటివి మైక్రో ఛీటింగ్‌కు ఉదాహరణలు. ఇలాంటి మోసాలు మొదట్లో చిన్నగా అనిపించినప్పటికీ.. కాలక్రమేణా బంధంలో దూరాన్ని పెంచేస్తాయి. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్య అడ్డుగోడలు ఏర్పడతాయి. ఈ సమస్యకు పరిష్కారం కాలం కాదు.. కలిసి జీవిస్తున్న భాగస్వాములే వెతుక్కోవాలి.
కొన్నిసార్లు ఆకర్షణలు తాత్కాలికంగా ఉండవచ్చు. 'అటెన్షన్ సీకర్స్', ఆత్మన్యూనత ఉన్న వాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అయితే, బలమైన బంధం, భయం, సామాజిక విలువలు వారిని తిరిగి నిజాయితీ పరులుగా మార్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ మోసాలు వేధింపుల రూపం దాల్చవచ్చు. ఒకవైపు ప్రేమ లేకపోయినా, కొత్త నెంబర్లతో ఇబ్బంది పెట్టడం వంటివి జరుగుతాయి. అయితే, అన్ని మైక్రో ఛీటింగ్ కేసులూ ఒకే విధంగా ముగిసిపోవు. కొన్నిసార్లు ఇవి పెద్ద మోసాలకు దారితీయవచ్చు.
కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత లేనివారు ఆన్లైన్లో వేరే ప్రపంచాన్ని వెతుక్కోవచ్చు. ఇది ఒక మానసిక రుగ్మత లక్షణం కూడా కావచ్చు. దీనికి చికిత్స ఉంటుంది.చిన్న చిన్న అబద్ధాలు కూడా నమ్మకాన్ని పోగొడతాయి. కాబట్టి, ఎటువంటి బంధమైనా నిజాయితీ అనే పునాదుల మీదనే నిలబడుతుంది. ప్రతి మైక్రో ఛీటింగ్లో ముగ్గురు ఉంటారు.. మోసం చేసేవాడు తనను తాను మోసం చేసుకుంటాడు, తన భాగస్వామిని మోసం చేస్తాడు, మూడో వ్యక్తిని మోసం చేస్తాడు. గతంలో లిప్‌స్టిక్ మరకలు, సినిమా టిక్కెట్లు వంటివి మోసాలను బయటపెట్టేవి. ఇప్పుడు సోషల్ మీడియా వేదికైంది. ఫేక్ ఐడీలతో ఎలాగైనా ప్రవర్తించవచ్చు. గంటల తరబడి సోషల్ మీడియా చూడడం మానసిక సమస్యే. కొందరు వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. ఇది నమ్మకద్రోహమే.
ఈ మోసాల తీవ్రత పెరిగితే బంధాలు తెగిపోతాయి. మొదట్లోనే అసహజ ప్రవర్తనను గుర్తించి హెచ్చరించాలి. అవసరమైతే కపుల్ థెరపీ తీసుకోవాలి. బంధాన్ని బతికించుకోవడానికి కలిసి చర్చించుకోవాలి. జీవితంలో ఆకర్షణలు సహజం కానీ వాటికి అతుక్కుపోకూడదు. కొత్త బంధాల కంటే పాత బంధాలను బలంగా ఉంచుకోవాలి. తాను చేసే పనిని తన భాగస్వామి చేస్తే అంగీకరిస్తానా అని ప్రశ్నించుకుంటే సగం సమస్యలు తీరుతాయి.
కొన్నిసార్లు అపోహలు కూడా బంధాలను పాడు చేస్తాయి. కాబట్టి, నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో, నిజాయితీగా ప్రవర్తించడం కూడా అంతే ముఖ్యం. అనుమానాలు ఉంటే బహిరంగంగా చర్చించుకోవాలి. మైక్రో ఛీటింగ్ కేవలం ప్రేమ బంధాలకే పరిమితం కాదు, ఆఫీసుల్లోనూ ఉంటుంది. సొంత పనులు చేసుకోవడం, కంపెనీ వనరులు దుర్వినియోగం చేయడం, తప్పుడు బిల్లులు పెట్టడం వంటివి కెరీర్‌ను నాశనం చేస్తాయి. స్నేహ బంధాల్లోనూ మోసాలు జరుగుతాయి. వ్యాపారాల్లో నిధులు వాడుకోవడం, అబద్ధాలు చెప్పడం స్నేహాలను బలి తీసుకుంటాయి. బీమా కంపెనీలకు ఆరోగ్య వివరాలను దాచడం కూడా మోసమే. 'మైక్రో ఛీటింగ్' రబ్బరు బుల్లెట్ల లాంటిది. గాయం తక్కువే కానీ, పెద్ద ప్రమాదానికి సూచన. జాగ్రత్తపడితే బంధాన్ని కాపాడుకోవచ్చు. గతం గురించి బాధపడకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి.